ఉమ్మడి జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ హాజరయ్యారు.
జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై శకటాల ప్రదర్శన, ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు.
– కామారెడ్డి/ కంఠేశ్వర్, ఆగస్టు 15