గ్రామ పంచాయతీల్లో వందశాతం పన్ను వసూలు చేయడమే లక్ష్యంగా అధికారులు శ్రమిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని 530 గ్రామ పంచాయతీల్లో రూ.30.22 కోట్ల పన్ను వసూలు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 72 శాతం లక్ష్యం పూర్తయ్యింది. రూ.21.65 కోట్ల పన్ను వసూలు కాగా, మరో రూ.8.60 కోట్లు రావాల్సి ఉంది. గతంలో మాదిరిగా పంచాయతీ కార్యదర్శుల కొరత లేకపోవడం.. నిర్లక్ష్యం వహించే వారిపై పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకునే వీలుండడంతో పన్ను వసూళ్లను పకడ్బందీగా చేపడుతున్నారు. ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో.. ఈ లోగా వందశాతం లక్ష్యాన్ని చేరుకునేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 94.27 శాతం పన్ను వసూళ్లతో ఇందల్వాయి మండలం మొదటిస్థానంలో నిలిచింది. 89.78 శాతంతో మోపాల్, 88.68 శాతంతో నిజామాబాద్ రూరల్, 85.96శాతంతో సిరికొండ ముందువరుసలో ఉన్నాయి.
నిజామాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆర్థిక సంవత్సరం ముగింపునకు చేరుతున్న నేపథ్యంలో పన్ను వసూళ్లతో పల్లెల అభివృద్ధికి పాటుపడేందుకు కృషి చేస్తున్నారు. జిల్లాలో 530 గ్రా మ పంచాయతీలున్నాయి. ఆస్తి, కుళాయి, ఆస్తి మార్పిడి తదితర పన్నుల రాబడితో పంచాయతీలకు ఆదాయం పెరుగుతున్నది. గతంలో ఉమ్మడి జిల్లాగా కావడం, విస్తీర్ణం ఎక్కువ ఉండడం, పంచాయతీలు అధికంగా ఉండడంతో జిల్లా స్థాయి అధికారుల నుంచి పంచాయతీ సిబ్బందికి సరైన తోడ్పాటు అందేది కాదు. ప్రస్తుతం పరిధి చిన్నదిగా మారడంతో జిల్లా స్థాయి అధికారులు నిత్యం పంచాయతీ సిబ్బందిని పురమాయిస్తూ ఎక్కువ శాతం పన్నులు వసూలు చేసేందుకు అవకాశం ఏర్పడింది. గ్రామాల్లో కార్యదర్శుల కొరత ఇప్పుడు లేకపోవడంతో సర్పంచులు, గ్రామాభివృద్ధి కమిటీల సమన్వయంతో వసూళ్ల ప్రక్రియ చక్కగా కొనసాగుతున్నది. 2022 కొత్త సంవత్సరం ప్రారంభం నుంచే ఉన్నతాధికారులు పన్ను లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. మార్చి 31లోపు పన్ను వసూళ్ల టార్గెట్ను రీచ్ అయ్యేందుకు పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో లక్ష్యానికి చేరువలో నిజామాబాద్ డివిజన్లోని ఇందల్వాయి, మోపాల్, నిజామాబాద్ రూరల్, సిరికొండ మండలాలున్నాయి.
గ్రామాల్లో వంద శాతం పన్నులు వసూలై ఆ డబ్బులు పూర్తిగా సద్వినియోగమైతే పల్లెలు పచ్చగా ఉంటాయి. ప్రతి గ్రామానికీ మౌలిక వసతులు సమకూరుతాయి. మురుగు కాల్వలు, వీధి దీపాలు, నీటి పథకాల నిర్వహణ, మరమ్మతులు, రహదారుల నిర్మాణం తదితర పనులన్నీ చకచకా చేసుకోవచ్చు. అందుకే పంచాయతీల్లో ఇంటి పన్నులు, ఆస్తి, ఇతరత్ర పన్నుల వసూలుకు జిల్లా అధికార యంత్రాంగం ముమ్మర కసరత్తు చేస్తున్నది. పంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరు పన్నులు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం సీరియస్గా దృష్టి పెట్టింది. పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహించే కార్యదర్శులపై పంచాయతీ రాజ్ చట్టం -2018 ప్రకారం చర్యలు తీసుకునే వీలుండడంతో వారంతా పన్నుల వసూళ్ల కోసం పాటుపడుతున్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలతో సమావేశమై గ్రామాభివృద్ధి కోసం పన్నులను వసూలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో 530 గ్రామ పంచాయతీల్లో 30 కోట్ల 22లక్షల 96వేల 811 రూపాయల పన్ను వసూలు కావాల్సి ఉంది. ఇందులో 21కోట్ల 65లక్షల 47వేల 99 రూపాయలు వసూలైంది. వంద శాతం లక్ష్యంలో 72శాతం మేర సాధ్యమైంది. ఇంకా 8కోట్ల 57లక్షల రూపాయల పన్ను వసూలు చేయాల్సి ఉంది.
నిజామాబాద్ జిల్లాలో 29 మండలాలు ఉన్నాయి. ఇందులో 2 మండలాల్లో పంచాయతీలు లేవు. మిగిలిన 27 మండలాల్లో 530 గ్రామ పంచాయతీలు నెలకొన్నాయి. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 177 పంచాయతీల్లో రూ.14.21కోట్ల పన్ను వసూళ్ల లక్ష్యానికి 72.10 శాతం అంటే రూ.10.24 కోట్లు వసూలైంది. బోధన్ డివిజన్లో 142 గ్రామ పంచాయతీల్లో రూ.66.66 కోట్ల పన్ను వసూళ్ల లక్ష్యం కాగా 66.30 శాతం అంటే రూ.44.19 కోట్లు వసూలైంది. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్లో 211 గ్రామ పంచాయతీల్లో రూ.93.50 కోట్ల పన్ను వసూళ్లకు 74.73 శాతం అంటే రూ.69.87కోట్లు వసూలైంది. మండలాలవారీగా పరిశీలిస్తే టాప్లో ఇందల్వాయిలో 94.27 శాతం పన్ను వసూళ్లతో మొదటి స్థానంలో నిలిచింది. 89.78 శాతంతో మోపాల్, 88.68 శాతంతో నిజామాబాద్ రూరల్, 85.96శాతంతో సిరికొండ మండలాలు ముందు వరుసలో ఉన్నాయి. మోస్రా, డిచ్పల్లి, ఎడపల్లి, ఏర్గట్ల, నందిపేట, రుద్రూర్ మండలాల్లో పనితీరు ఆశించిన స్థాయిలో లేదు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో గ్రామ పంచాయతీల్లో పన్ను వసూళ్లలో 85శాతం మేర లక్ష్యాన్ని చేరుకున్నది. 2021-22లో 100 శాతం చేరుకునేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
గ్రామ పంచాయతీ పన్నుల వసూళ్లలో అక్కడక్కడ నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా బయటపడుతున్నది. వంద రోజుల ముందు నుంచే వంద శాతం పన్నుల వసూళ్లకు ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ కొంత మంది పన్నుల వసూళ్లపై సీరియస్గా దృష్టి పెట్టడం లేదు. తమ విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తుండడంతో నిర్ధిష్ట లక్ష్యానికి తగ్గట్లుగా పన్నుల వసూళ్లు పూర్తి కావడం లేదు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ చురుగ్గా పన్నుల వసూళ్ల పర్వం కొనసాగుతున్నది. నిజామాబాద్ జిల్లాలోనూ ఈ ప్రక్రియకు వేగంగానే అడుగులు పడుతున్నా మిగతా జిల్లాలతో పోలిస్తే కాసింత వెనుకబాటులో ఉన్నది. 15 రోజులకోమారు ఉన్నతాధికారులు స్వయంగా ఈ అంశంపై ప్రత్యేకంగా సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నారు. పన్ను వసూళ్లలో పరుగులు పెట్టించాలని జిల్లా పంచాయతీ అధికారికి, శాఖ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. అయినా సరే, కింది స్థాయి సిబ్బందిలో మాత్రం స్పందన కనిపించకపోవడం గమనార్హం. గ్రామాల్లో సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులంతా కలిసికట్టుగా పన్ను వసూళ్లకు పాటుపడేలా, సమన్వయంతో లక్ష్యాన్ని సులువుగా చేరుకునేందుకు జిల్లా స్థాయిలో అధికారులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో 530 గ్రామ పంచాయతీలకు రూ.30.22 కోట్లు పన్ను వసూళ్ల లక్ష్యం ఉంది. ఇప్పటికే 72శాతం మేర పన్నులు వసూలయ్యాయి. మిగిలిన లక్ష్యాన్ని మార్చి నెలాఖరులోగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాము. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో శత శాతం పన్నుల వసూలే లక్ష్యంగా పని చేస్తున్నాము. ప్రజలు సైతం గ్రామ పంచాయతీ పన్ను బకాయిలను స్వచ్ఛందంగా కట్టేందుకు ముందుకు రావాలని కోరుకుంటున్నాము.
– జయసుధ, నిజామాబాద్ జిల్లా పంచాయతీ అధికారిణి