నిజామాబాద్, సెప్టెంబర్ 3, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లంచావతారాలు పెచ్చుమీరుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ప్రతి పనికి రేటు కట్టి వేధిస్తున్నారు. కొంత మంది అధికారుల తీరు… దొరికితే దొంగ అన్నట్లుగా మారింది. నీతులు వల్లిస్తూ టేబుల్ కింద చేతులు చాచనిదే పని చేయని మహానుభావులు ఎంతో మంది ఉభయ జిల్లాల కలెక్టరేట్లో కొలువుదీరారు. ఏళ్లుగా పాతుకుపోయిన వారితో పాటుగా వివిధ జిల్లాల నుంచి పనిష్మెంట్పై, పదోన్నతిపై, సాధారణ బదిలీపై వచ్చిన వారిలో ఎక్కువ మంది వేధింపులే లక్ష్యంగా పని చేస్తున్నారు.
ఆమ్యామ్యాలు అప్పగించకపోతే పనులను పెండింగ్‌లో పెట్టి వేధిస్తున్నారు. బిల్లులు పాస్ చేయాలంటే ఎంతో కొంత సర్దుకోవాల్సి దుస్థితి ఏర్పడింది. కారు డ్రైవర్‌కు జీతం మంజూరు దగ్గరి నుంచి మొదలు పెడితే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు దాకా పర్సంటేజీల పర్వం నడుస్తోంది. ఇంజనీరింగ్ శాఖల్లో పంచాయతీ, రోడ్డు భవనాలు, ఇరిగేషన్ శాఖల్లో పెచ్చుమీరిన అవినీతి, అక్రమాలు కొనసాగుతున్నాయి. చాప కింద నీరులా ఇంజనీరింగ్ శాఖల్లో అక్రమాలు జరుగుతున్నప్పటికీ ఇటువైపు అవినీతి నిరోధఖ విభాగం(ఏసీబీ) దృష్టి సారించకపోవడంపై అనుమానాలకు తావిస్తోంది. ప్రధానంగా పోలీస్, రెవెన్యూ, రవాణా, విద్యా, వైద్య, ఎక్సైజ్ శాఖల్లో విపరీతమైన దోపిడీ తంతు రాజ్యమేలుతోంది. ఈ ఏడాది నిజామాబాద్‌లో 7, కామారెడ్డిలో 5 కేసులు నమోదు కావడం పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది.
ఖాకీ దుస్తులకు అవినీతి మచ్చ..
ఖాకీ దుస్తువులు క్రమశిక్షణ, నీతికి, నిజాయతీకి మారుపేరు. అయితే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో యూనిఫాం సర్వీసుల్లో విపరీతమైన దోపిడీ కొనసాగుతోంది. ఏడాది కాలంలో పోలీస్ శాఖలో ముగ్గురు ఎస్సై ర్యాంక్ అధికారులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇసుక మామూళ్లలో వసూళ్లకు తెగబడిన కారణంతో సీఐపై బదిలీ వేటు వేశారు. కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లపైనా ఆరోపణలు రావడంతో చర్యలు తీసుకున్నారు. రవాణా శాఖలో మూడు నెలల వ్యవధిలో మూడు సార్లు ఏసీబీ దాడులు జరిగాయి.
తాజాగా ఆర్మూర్‌లో రూ.25వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ చిక్కాడు. అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే మద్నూర్ అంతరాష్ట్ర రవాణా శాఖ చెక్‌పోస్ట్, కామారెడ్డి శివారులోని పొందూర్తి రవాణా శాఖ చెక్పోస్టులపై దాడులు నిర్వహించి నగదను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. వరుస సోదాలు నిర్వహించినప్పటికీ రవాణా శాఖ ఉద్యోగుల్లో కనీస భయం అన్నదే కనిపించలేదు. సీన్ కట్ చేస్తే లంచం పుచ్చుకుంటూ ఎంవీఐ దొరకడంతో రవాణా శాఖ దుస్థితిని తేటతెల్లం చేస్తోంది. ఇక ఎక్సైజ్ శాఖలో వసూళ్ల పర్వంతో బహిరంగంగానే కొనసాగుతోంది.
వైన్స్ దుకాణాదారుల నుంచి నెలవారీగా మామూళ్లు వసూళ్లు చేసుకుంటూ దేశిదారును ఆబ్కారీ శాఖనే పెంచి పోషిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మామూళ్ల మత్తులో జోగుతూ కల్తీ కల్లు మాఫియాకు సహకారం అందిస్తూ ఎక్సైజ్ శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలా ఖాకీ దుస్తులు ధరిస్తోన్న శాఖల్లో అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఈ అక్రమాల తంతు అటవీ శాఖలోనూ కలకలం రేపుతోంది. భూ ఆక్రమణాదారులతో చేతులు కలిపి కొంత మంది ఫారెస్ట్ అధికారులే అటవీ భూములను దారాధత్తం చేస్తున్నారు.
వివాదాల విద్యాశాఖ…
అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా విద్యాశాఖ నిలుస్తోంది. గతంలో ఇక్కడ పని చేసిన ఓ విద్యాశాఖ అధికారి ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలతో కుమ్మక్కై ఇష్టారీతిన డబ్బులు దండుకున్నాడు. ప్రభుత్వం ఆయన్ని బదిలీ చేయగా ఈ విషయంపై ఏసీబీ దృష్టి సారించి సోదాలు నిర్వహించింది. వారం రోజుల క్రితం గత అధికారికి సహకరించిన ఇంటి దొంగలను విచారించింది. విద్యాశాఖ అధికారులకు డీఈవో కార్యాలయంలో ఏళ్లుగా పాతుకు పోయిన ముగ్గురు వ్యక్తులే అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఇంటికి సరుకులు చేర్చడంతో మొదలు పెడితే సపర్యాలు సమకూరుస్తున్నారన్న చర్చ ఉపాధ్యాయుల్లో నడుస్తోంది.
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోన్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోకపోవడం, వచ్చిన ఫిర్యాదులపై స్పందించకపోవడం, తూతూ మంత్రంగా విచారణలు చేసి మమ అనిపించడం, బహిరంగంగానే అక్రమ అడ్మిషన్లు జరిగినా పట్టించుకోని వ్యవహారాలను ఏసీబీ గుర్తించింది. ప్రభుత్వ బడులను తనిఖీలకు వెళ్లినప్పుడు వేధింపులకు గురి చేయడం, మెమోలు, షోకాజ్ నోటీసులు జారీలోనూ వసూళ్లకు తెగబడటం వంటివి గతంలో అనేకం జరిగినట్లుగా ఏసీబీ దృష్టికి వచ్చింది. అక్రమాలకు కేరాఫ్‌గా నిలిచిన నిజామాబాద్ డీఈవో కార్యాలయంలో ఇప్పటికీ ఎలాంటి మార్పు లేకపోవడంతో తాజా ఘటనలపైనా ఏసీబీకి పలు ఉపాధ్యాయ సంఘాలు ఫిర్యాదులు చేసినట్లుగా తెలుస్తోంది.
రెవెన్యూలోనూ అక్రమార్కులు…
రెవెన్యూ శాఖలో వసూళ్ల దందా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక దోపిడీకి పాల్పడటంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా రెవెన్యూ శాఖ అధికారులే సపోర్ట్ చేస్తున్నారు. ఈ మధ్యనే రెంజల్ మండలంలో ఓ అధికారి ఇష్టారీతిన డబ్బులు దండుకోవడంతోనే స్థానిక ప్రజాప్రతినిధి ఆగ్రహానికి గురై సెలవులపై వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. రేషన్ కార్డుల జారీలోనూ విచారణ తంతును అనుకూలంగా ముగించేందుకు బోధన్, ఆర్మూర్ డివిజన్లో పెద్ద ఎత్తున డబ్బులు వసూళ్లు చేశారు. ఈ కారణంతోనూ రెవెన్యూ ఇన్స్పెక్టర్లను స్థాన చలనం చేశారు.
నిజామాబాద్ రెవెన్యూ డివిజన్‌లోనూ నాలుగైదు మండలాల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఇష్టారీతిన డబ్బులు దండుకోగా ఎమ్మెల్యే క్లాస్ తీసుకున్నట్లుగా తెలిసింది. రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు కులం, ఆదాయ సర్టిఫికేట్ జారీకి భారీగా డబ్బులు డిమాండ్ చేసిన ఆనవాళ్లు వెలుగు చూశాయి. భూ భారతి కొత్త చట్టం అమల్లోకి రావడంతో భూ సమస్యల పరిష్కారానికి వచ్చిన దరఖాస్తులను అక్రమార్కులు ఇప్పటికే జల్లెడ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రిస్క్‌తో కూడిన దరఖాస్తులను చేత పట్టుకుని పైరవీలకు కొంత మంది రెవెన్యూ ఉద్యోగులే మధ్యవర్తుల ద్వారా బాటలు వేయిస్తున్నారు. ఇలా రెవెన్యూ శాఖను అవినీతి వ్యవహారాలు పట్టి పీడిస్తున్నప్పటికీ పట్టించుకునే నాథుడు కరువయ్యారు.