నిజామాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలో వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతున్నది. సామాన్యుల అవసరాలను ఆసరాగా చేసుకొని వారిని వడ్డీ వ్యాపారులు నిలువునా దోచుకుంటున్నారు. అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి వారి కుటుంబాలను ఛిద్రం చేస్తున్నారు. తీసుకున్న అప్పు చెల్లించనివారిని వేధింపులకు గురిచేస్తున్నారు. వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక కొన్నికుటుంబాలు బలవన్మరణాలకు పాల్పడగా..మరికొందరు రోడ్డున పడిన ఉదంతలూ ఉన్నాయి. ఇటీవల వడ్డీ వ్యాపారుల ఇండ్లు, ఆఫీసులపై పోలీసులు దాడులు చేసినా వారి ఆగడాలు ఆగడంలేదు. అప్పు తీసుకున్నవారికి వారి వేధింపులు తప్పడంలేదు. కఠిన చర్యలు తీసుకుంటే తప్ప వడ్డీ వ్యాపారం నియంత్రణలోకి వచ్చే అవకాశం లేదని పలువురు భావిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. పోలీసులు దాడిచేసినా వారిలో ఇసుమంతైనా భయం కనిపించడంలేదు. తహసీల్దార్ వద్ద అనుమతి పత్రాల పేరుతో ఇష్టానుసారంగా చెలరేగిపోతున్నారు. వారి ఆగడాలను అడ్డుకునే వారే కరువయ్యారు. అవసరానికి చేసే అప్పు ప్రాణాల మీదికి తీసుకువస్తున్నది. వడ్డీ వ్యాపారుల వేధింపుల మూలంగా చేసేది లేక కొందరు తనువుచాలిస్తుండడం ఆందోళన కలిగిస్తున్నది. వడ్డీ వ్యాపారుల వేధింపులతో బలవన్మరణానికి పాల్పడిన ఘటనలపై హడావుడి చేసే పోలీసులు తర్వాత మిన్నకుండి పోతున్నారు.
తప్పు చేసిన వారంతా రాజకీయ నాయకుల అండదండలతో బయట పడుతున్నారు. అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలైతే తమ దారికి అడ్డేది అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ అనుమతి లేకుండానే వడ్డీ దందా నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో చెలరేగిపోతుండగా మరికొందరు అధికారులను మచ్చిక చేసుకొని తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా మార్చుకుంటున్నారు. కఠిన చర్యలు తీసుకోకపోవడంతో అక్రమ వడ్డీ వ్యాపారం చాప కింద నీరులా విస్తరిస్తున్నది.
పోలీసుల సోదాలు కేవలం అడపా దడపా మాత్రమే జరుగుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు ఆదేశాలు ఇస్తేనే ఠాణా నుంచి కదులుతున్నారు. సామాన్యుల నుంచి ఫిర్యాదులు వస్తే పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వడ్డీ వ్యాపారుల వేధింపులకు పదుల సంఖ్యలో కుటుంబాలు రోడ్డున పడగా, మరికొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. గంగాస్థాన్, న్యాల్కల్ రోడ్డులో రెండు కుటుంబాలు వడ్డీ వ్యాపారుల ధన దాహానికి బలయ్యాయి.
ఇలాంటి ఘటనలు పునరావృతంగా కాకుండా ఉండాలంటే పోలీసులు నిరంతరం తనిఖీలు చేస్తేనే ఫలితం ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. వడ్డీ వ్యాపారులపై నిఘా పెట్టి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటేనే ఈ దందాకు ఫుల్ స్టాప్ పడుతుందని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర తమదైన రీతిలో పోలీస్ శాఖను పరుగులు పెట్టిస్తున్నారు. సామాన్యులకు బాసటగా నిలిచేందుకు పాటు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో వేళ్లూనుకునిపొయిన ఫైనాన్స్ దందాపైనా ఇద్దరు అధికారులు దృష్టి పెట్టి దారిలోకి తీసుకు రావాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమార్కులకు సహకరిస్తున్న ఖాకీలపైనా నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.
వడ్డీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపకపోవడంతో వారి ఆగడాలు అంతులేకుండా పోతున్నది. అప్పు ఇచ్చే సమయంలో సామాన్యుల అవసరాన్ని పసిగట్టి వారి ఇంటి పత్రాలు, భూ పట్టాదారు పాస్ పుస్తకాలను లాక్కుంటున్నారు. లేదంటే తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకుంటున్నారు.
స్పాంప్ కాగితాలపైనా సంతకాలు పెట్టించుకుని అధిక వడ్డీకి అప్పు ఇస్తున్నారు. కొంత మంది నిర్దిష్ట సమయానికి డబ్బులు చెల్లించకుంటే ఆస్తి పత్రాలను తమపేరుమీదకి బదిలీ చేసుకునే విధంగా రాయించుకుంటున్నారు. ఇంటి, భూ కాగితాలను విడిపించుకునేందుకు భారీ వడ్డీలకు మరోసారి అప్పు చేయాల్సి వస్తున్నది. కొన్ని సందర్భాల్లో ఒక చోట వడ్డీకి తెచ్చిన అప్పును తీర్చడానికి మరోచోట అప్పు చేయాల్సి వస్తున్నది. ఇలా చిన్నపాటి అవసరాల కోసం చేసిన అప్పుతో మొత్తంగా అందులోనే కూరుకుపోతున్న ఘటనలు అనేకం ఉన్నాయి.
అప్పులు కట్టలేక సామాన్యులు చితికిపోతుంటే వడ్డీ వ్యాపారులు కోట్ల రూపాయలకు ఎదుగుతున్నారు. ప్రైవేటు వ్యక్తుల భూ పత్రాలను దాచి పెట్టుకోవడం న్యాయపరంగా నేరం. చీటింగ్ లేదా దొంగతనంతో సమానమైన కేసు నమోదు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ వీటికి ఎవరూ భయపడడం లేదు. పోలీసులను మచ్చిక చేసుకుని ఇదంతా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో ఈ తరహా దందా విచ్చలవిడిగా జరుగుతున్నది.