నిజాంసాగర్, జనవరి 6: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. ఇసుకాసురులకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుకను అధిక ధరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. మంజీరా పరీవాహక ప్రాంతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యేడు నిజాంసాగర్ నీటిని విడుదల చేయడంతో భారీగా ఇసుక మేటలు వేశాయి. ఇదే అదునుగా భావిస్తున్న ఇసుకాసురులు పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక అక్రమంగా రవాణా చేస్తూ రహస్య ప్రదేశాల్లో డంపు చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు తరలించి అందినకాడికి దోచుకుంటున్నారు. మంజీరా పరీవాహక ప్రాంతంలోని అచ్చంపేట, మర్పల్లి, బ్రహ్మణపల్లి, ఆరేపల్లి గ్రామాలకు చెందిన కొంతమంది ట్రాక్టర్ యజమానులు మధ్యాహ్నం వేళ కుప్పలు పోస్తూ, రాత్రి సమయంలో అక్రమంగా రవాణా చేస్తున్నారు. వీరికి అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది.
రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే..
నిజాంసాగర్ మండలంలోని ఆయా గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతున్నా, రెవె న్యూ అధికారులు తమకేమీ తెలియదని చెప్పడం గమనార్హం. ఇటీవలే గ్రామాల్లో నూతనంగా ప్రతి గ్రామానికి జీపీవోను నియమించారు. ఇసుక నిల్వలు ఏ గ్రామాల్లో ఉన్నాయో తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఇసుక రవాణాకు అనుమతులు అందజేయాలని కలెక్టర్ ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు.
కానీ ఇక్కడ మాత్రం ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల పేరిట పక్కదారి పట్టిస్తున్నారు. దీనికి అధికారులు వంత పాడుతుండడం గమనార్హం. అనుమతుల ప్రకారం ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రవాణా చేయాల్సి ఉన్నా, కొన్ని సందర్భాల్లో రాత్రి సమయంలో అనుమతులు లేని ట్రాక్టర్లలో జోరుగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా అదనంగా వసూలు చేస్తూ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు ఇసుకను అందిస్తున్నారు. జీపీవోల కనుసన్నుల్లో ఒకే అనుమతి పత్రంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇసుక రవాణా చేస్తుండడం గమనార్హం.
ఇటీవల ఇందిరమ్మ ఇండ్లకని రాత్రిపూట రవాణా ఇసుక చేస్తున్న ట్రాక్టర్లను అనుమానం వచ్చి పోలీసులు పట్టుకోగా, ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చిం ది. దీంతో నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇసుక కుప్ప లు దర్శనమిస్తున్నాయని, వాటిని సీజ్ చేసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ లబ్ధిదారులకు అందజేస్తే లాభం చేకూరుతుందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నప్పటికీ అక్రమార్కుల తీరు మాత్రం మారడంలేదు.
ఇసుక కుప్పలు ఉన్నవి వాస్తవమే
అచ్చంపేట, ఆరేపల్లి, బ్రాహ్మణపల్లి, మర్పల్లి గ్రామాల్లో ఇసుక కుప్పలు ఉన్నవి వాస్తవమే. అచ్చంపేటలో చాలా కుప్పలను పరిశీలించాను. అన్ని గ్రామాల్లో పర్యటించి, ఇసుక కుప్పలను పరిశీలించి వాటిని సీజ్ చేస్తాం.
-సాయిలు, ఆర్ఐ, నిజాంసాగర్