నందిపేట్, మే 28: మండలంలో నల్లమట్టి వ్యాపారం జోరుగా సాగుతున్నది. గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి కొందరు అక్రమార్కులు పెద్ద పెద్ద యంత్రాల ద్వారా మట్టి తవ్వకాలు చేపట్టి, టిప్పర్ల ద్వారా తరలిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. అక్రమార్కులందరూ సిండికేట్‌గా మారడం గమనార్హం. గ్రామాల్లో పెద్దమనుషులుగా చెలామణి అయ్యే వారికి డబ్బులు ముట్టజెప్పి నల్లమట్టి దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. వారం పది రోజులుగా నందిపేట్ మీదుగా ఆర్మూర్ చుట్టుపక్కల మండలాలకు నిత్యం టిప్పర్ల ద్వారా నల్లమట్టిని తరలిస్తున్నారు.
నల్లమట్టి తవ్వకాలకు అసలు వీరు అనుమతి తీసుకున్నారా లేదా అనేది ప్రశ్నార్థకం. నల్లమట్టిని తరలించే వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్లడంతో ప్రమాదాలు చోటుచేసుకొని ఎంతో మంది గాయపడిన సందర్భాలూ ఉన్నాయి. ఈ సీజన్లోనూ చౌడమ్మ కొండూర్ దారిలో టిప్పర్ ఢీకొని బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదాలపై గతేడాది చౌడమ్మ కొండూర్ గ్రామస్తులు రాస్తారోకోలు, నిరసనలు చేసినప్పటికీ నల్లమట్టి అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట పడలేకపోయింది.
చౌడమ్మ కొండూర్, ఉమ్మెడ, అలాగే గోదావరి నదికి అవతలి ఒడ్డున ఉన్న నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పంచగుడి గ్రామానికి సమీపంలోని గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి మట్టిని తవ్వే మిషన్లను తీసుకువచ్చి టిప్పర్లలో నింపుతూ వ్యాపారం సాగిస్తున్నారు. గోదావరిలో నీరు తగ్గిన కొద్దీ నల్ల మట్టిని తవ్వకాలు జోరుగా చేపడుతున్నారు. ఓవర్‌లోడ్‌తో ఇటీవల కాలంలో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. ఓవర్‌లోడ్ కారణంగా ఈమధ్యకాలంలో వేసిన రోడ్లు సైతం గుంతలు ఏర్పడి దెబ్బతింటున్నాయి. ప్రస్తుతం ఓవర్‌లోడ్ తగ్గినా, వాహనాల వేగం నియంత్రించిలేకపోతున్నారు. ఇప్పటికైనా ఎస్సారెస్పీ, మైనింగ్, రెవెన్యూ, రవాణా, పోలీసుశాఖ అధికారులు స్పందించి నల్లమట్టి అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఎస్సారెస్పీ నుంచి అనుమతులుంటేనే మట్టిని తరలించుకోవచ్చు. అనుమతులు లేకుండా నడుస్తున్న వాహనాలను ఎప్పటికప్పుడు సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. నల్లమట్టి అక్రమ తరలింపుపై ఎస్సారెస్పీ అధికారులకు ఉత్తరాలు రాస్తున్నాం. మిగతా శాఖల సమన్వయంతో అక్రమ మట్టి తరలింపును అరికడుతాం.
-సంతోష్‌రెడ్డి, తహసీల్దార్, నందిపేట్