పొతంగల్ జులై 28 : పొతంగల్, కోడిచెర్ల మంజీర శివారు సరిహద్దు వివాదాన్ని వెంటనే పరిష్కరించాలని కోడిచర్ల గ్రామస్తులు, ట్రాక్టర్ యజమానులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం పోతంగల్ తహసీల్దార్ గంగాధర్‌కు వినతి పత్రం అందజేశారు. పోతంగల్ గ్రామానికి చెందిన వ్యక్తులు పొతంగల్ మంజీరా శివారు నుండి ఇసుక రవాణాకు అనుమతి తీసుకొని అక్రమంగా కొడిచర్ల శివారులో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని మండిపడ్డారు.
ఈ విషయంపై గతంలో తహసీల్దార్ దృష్టికి తీసుకు వెళ్లగా సర్వేయర్ హద్దులు చూపెట్టినప్పటికి అదే తంతు కొనసాగుతుందని అన్నారు. పొతంగల్ కు చెందిన వ్యక్తులు కోడిచర్ల మంజీరా సరిహద్దులో ఇసుక తవ్వకాలు జరపకుండా చర్యలు తీసుకోవాలని, కొడిచర్ల,పోతంగల్ మంజీర శివారు సరిహద్దు వివాదాన్ని వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు ఉన్నారు.