నిజామాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంజీర పరీవాహక ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించేందుకు ఖాకీలు పోటీపడుతుంటారు. ఇందుకోసం రాజకీయ పైరవీలు చేసుకొని మరీ పోస్టింగ్ సాధిస్తారు. అలాంటి వారు పోలీస్ ఉన్నతాధికారులను లెక్క చేయకుండా ఖద్దరు నేతల ఆశీస్సులుంటే చాలనుకుంటారు. ముడుపులు ఇచ్చి పోస్టింగ్ తెచ్చుకున్న ఖాకీలు బరితెగించి వసూళ్లకు పాల్పడుతున్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ నుంచి మొదలు నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వరకూ మంజీర పరీవాహక ప్రాంతం ఉన్న ఆయా పోలీస్ స్టేషన్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.
మంజీరలో లక్షల క్యూబిక్ మీటర్లలో ఇసుక తవ్వకాలకు అవకాశం దక్కడమే ఇందుకు ప్రధాన కారణం. అందులోనూ ఇసుక క్వారీ లు నిర్వహించే ప్రాంతాల్లో మరింత ప్రాధాన్యత ఉన్న ది. కొంత మంది సీఐ, ఎస్సైలు బహిరంగంగానే వసూ ళ్ల పర్వం కొనసాగిస్తున్నప్పటికీ పోలీస్ బాస్‌లు కూడా పట్టించుకోవడం లేదు. తప్పు చేస్తే చిన్నపాటి కారణాలపై కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసే ఉన్నతాధికారులకు ఇలాంటి అక్రమార్కులపై నిఘా ఎందుకు పెట్టడం లేద ని సొంత శాఖలోని కొంతమంది సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. మంజీర పరీవాహకంలో ఇసుక దందా నడుస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కించడం విడ్డూరంగా మారింది.
ఇసుక అక్రమ వ్యవహారాల్లో పోలీసులకు దీటుగా రెవెన్యూ అధికారులు సైతం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆర్డీవోగా మంజీర పరీవాహక ప్రాంతాల్లో ఇద్దరు ఐఏఎస్ అధికారులు పని చేస్తున్నారు. అయినప్పటికీ తహసీల్దార్ల అక్రమాలకు అడ్డుకట్ట పడకపోవడంపై ప్రజల్లో చర్చ నడుస్తున్నది. ఐఏఎస్ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ప్రభావం చూపుతున్నాయా? అనే వాదన కూడా వినిపిస్తున్నది. ఐఏఎస్ అధికారుల ఆదేశాలను ఆయా మండలాల్లో తహసీల్దార్లు పట్టించుకోవడం లేదనే వాదన కూడా ఉన్నది. అవకాశం దొరికినప్పుడల్లా అక్రమార్కులపై మంజీర పరివాహక ప్రాంతాల్లోని ఆర్డీవోలు ఉక్కుపాదం మోపుతున్నారు.
కానీ స్థానిక రెవెన్యూ సిబ్బంది అంతగా సహకరించడం లేదని తెలుస్తున్నది. ఈ మధ్యనే మంజీర పరీవాహక ప్రాంతానికి బదిలీపై వచ్చిన ఓ వివాదాస్పద తహసీల్దార్ పాత్రపై ఏసీబీ దృష్టి పెట్టినట్లు తెలుస్తున్నది. సదరు తహసీల్దార్ ఓ పోలీస్ అధికారికి అత్యంత సన్నిహితుడు. అతడికి పోస్టింగ్ ఇప్పించడంలోనూ సదరు పోలీస్ అధికారి కీలకంగా వ్యవహరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ శాఖలోనూ ఏసీబీ సోదాలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. కొంతమంది పోలీసులు, తహసీల్దార్లకు సంబంధించిన సంపాదనలో ఆదాయానికి మించిన ఆస్తులు సైతం వెలుగు చూసే అవకాశం ఉన్నట్లు
చెబుతున్నారు.
గతేడాది నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్న పది మంది ఎస్సైలు, ఇద్దరు సీఐలపై చర్యలు తీసుకోవాలని స్వయంగా డీజీపీ జితేంద్ర ప్రసాద్ మెమో జారీచేశారు. నిఘా వర్గాల సమాచారం మేరకు వచ్చిన వివరాలను ఉటంకిస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేయడంతో పలువురిపై బదిలీ వేటు వేశారు. కామారెడ్డిలో ఈ తరహాలో ప్రక్షాళన జరగడం లేదన్న వాదన వినిపిస్తున్నది.
సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ జితేంద్రప్రసాద్ ప్రత్యక్షంగా అనేక మార్లు సహజ వనరుల దోపిడీపై ఉక్కుపాదం మోపాలని చెప్పారు. ఎంతటి వారినైనా పట్టుకుని చట్ట ప్రకారం శిక్షించాలన్నారు. కానీ సీఎం, డీజీపీ ఆదేశాలు మాత్రం ఇక్కడ అమలు కావడం లేదు. కామారెడ్డి జిల్లాలో జనవరి 29న లంచం తీసుకుంటూ లింగంపేట ఎస్సై సుధాకర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. అనంతరం నాలుగు నెలలకు ఏసీబీ అధికారులు నేరుగా బిచ్కుంద పోలీస్‌స్టేషన్‌లోనే సోదాలు నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
బిచ్కుంద పోలీస్‌స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఆకస్మిక సోదాలతో ఇసుక అక్రమార్కులతో పోలీసులు చేతులు కలిపిన వైనం తేటతెల్లమైంది. బిచ్కుంద ఠాణాలో బహిరంగంగానే అక్రమార్కులతో అంటకాగుతూ డబ్బులు డిమాండ్ చేయడం ఏసీబీ అధికారుల సోదాల్లో వెల్లడైంది. దీంతో పాటు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్న విషయాన్ని ఏసీబీ గుర్తించింది.
ఇసుక ట్రాక్టర్ల కోసం రాత్రి, పగలు తేడా లేకుండా కాపుగాచి మామూళ్లు వసూలు చేస్తున్నట్లుగా ఏసీబీ గుర్తించింది. నెలవారీ మామూళ్లతోపాటు వారం, రోజువారీగా ట్రిప్పుకు ఒక రేటు చొప్పున వసూళ్లకు తెగబడుతున్నట్లు ఏసీబీ దృష్టికి వచ్చింది. పేరుకు బిచ్కుంద ఠాణాకు చెందిన పోలీసులే వసూళ్లలో ముందు కనిపిస్తున్నప్పటికీ తెర వెనుక ఇతర అధికారుల హస్తం కూడా ఉన్నట్లుగా తెలుస్తున్నది. అవినీతి, అక్రమాలు బహిరంగంగానే సాగుతుంటే పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు? అనే ప్రశ్నను లోతుగా ఏసీబీ పరిశీలిస్తున్నది.
వివాదాస్పద ఠాణాగా ముద్ర పడిన బిచ్కుంద పీఎస్‌పై ఆది నుంచి అందరి కన్ను ఉన్నది. అలాంటి ఠాణాపై నిరంతర నిఘా, పర్యవేక్షణ లేమి మూలంగా ఇక్కడ కొందరికి విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఏసీబీ అధికారుల సుదీర్ఘ సోదాల్లో అనేక అక్రమాలు, అవినీతి వెలుగు చూసింది. ఉన్నతాధికారులకు పూర్తి నివేదికను ఏసీబీ సమర్పించనున్నది. తప్పు చేసిన పోలీసులపై త్వరలోనే సస్పెన్షన్ లేదా బదిలీ వేటు పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.