మోర్తాడ్, నవంబర్ 27 : బాల్కొండ నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా మళ్లీ ప్రారంభమైంది. ‘సర్కారు ఆదాయానికి టెండర్’ శీర్షికన నమస్తే తెలంగాణ ఇటీవల ప్రత్యేక కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు, నాలుగు రోజుల పాటు ఇసుక అక్రమ తరలింపు ఆగిపోయింది. మళ్లీ ఏమైందో ఏమో.. ఎవరు చెప్పారో కానీ అక్రమ తవ్వకాలు మళ్లీ జోరందుకున్నాయి. మోర్తాడ్ మండలం శెట్పల్లిలో బుధవారం ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగింది. ఇక్కడ అధికార పార్టీకి చెందిన నాయకులే ఈ అక్రమ దందాకు ప్రధాన సూత్రధారులు కావడంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
శెట్పల్లి పెద్దవాగు నుంచి రోజుకు వందలాది ట్రిప్పుల ఇసుకను ట్రాక్టర్ల ద్వారా మోర్తాడ్ మండలంతోపాటు బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల్లోని గ్రామాలకు సరాఫరా చేస్తున్నారు. అయితే, ప్రభుత్వానికి ఎటువంటి రుసుము చెల్లించకుండా నడుపుతున్న అక్రమ ఇసుక రవాణాతో పెద్దమొత్తంలో డబ్బులు దండుకుంటున్నారు. శెట్పల్లి గ్రామం నుంచి బుధవారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను ముప్కాల్ మండలం నాగంపేట శివారులో రెవెన్యూ అధికారి పట్టుకున్నారంటే ఎంత సాఫీగా అక్రమ రవాణా జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు.
శెట్పల్లి గ్రామం నుంచి ఇసుక రవాణాకు గ్రామ కమిటీకి ఒక్కో ట్రిప్పుకు రూ.2 వేలు చెల్లిస్తున్నట్లు సమాచారం. మోర్తాడ్ మండలంతోపాటు ఇతర మండలాల అధికారులకు ఇసుక వ్యాపారులు ముడుపులు చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.200 వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. అధికారులకు భారీగానే అందుతుండడంతోపాటు అధికార పార్టీ నాయకులే ఇందులో ఉండడంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తు న్నారనే ప్రచారం జరుగుతున్నది.
ఇతర మండలాల్లో ఇసుక ట్రాక్టర్లను పట్టుకుంటుంటే, స్థానికంగా ఉన్న రెవెన్యూ, పోలీసు అధికారులు మాత్రం ఎందుకు కిమ్మనడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవలే జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను పట్టుకున్న పోలీసులు.. శెట్పల్లి నుంచి పెద్ద ఎత్తున ఇసుక తరలిపోతున్నా ఎందుకు నిలువరించలేక పోతున్నారనే ప్రశ్నకు సమాధానం కరువైంది.
మరోవైపు, అక్రమ తరలింపుపై అధికారులను ప్రశ్నిస్తే సరైన స్పందన ఉండడం లేదు. మోర్తాడ్ తహసీల్దార్ సత్యనారాయణ, డిఫ్యూటీ తహసీల్దార్ సుజాత సెలవులో ఉన్నారు. శెట్పల్లి పెద్దవాగు నుంచి అక్రమ ఇసుక రవాణా జరగుతున్న తీరుపై ఆర్ఐ రంజిత్‌ను వివరణ కోరగా.. శెట్పల్లి గ్రామం నుంచి ఇసుక రవాణాకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. మరీ పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఇసుక లోడ్‌తో వెళ్తుంటే అటు రెవెన్యూ, ఇటు పోలీసు అధికారుల కండ్లకు కనిపించకపోవడం గమనార్హం.