జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నది. ఇసుక దందా నియంత్రణకు యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇసుకాసురులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని సీఎం చెప్పినా, ఇసుక అక్రమరవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించినా ఫలితం కనిపించడంలేదు. సీఎం, సీపీ హెచ్చరికలను బాల్కొండ నియోజకవర్గంలోని అధికారపార్టీ నాయకులు, అధికారులు బుట్టదాఖలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో ఇసుక దందాకు అడ్డూ అదుపూలేకుండా పోయింది. అధికారులకు ముడుపులు చెల్లిస్తూ ఇసుకను అక్రమంగా తరలిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. నియోజకవర్గంలో అక్రమార్కులకు ఇసుక దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా మారింది.
బట్టాపూర్ నుంచి ఇసుక అక్రమ రవాణా చేసేందుకు ఆరు నెలలుగా అధికారపార్టీకి చెందిన వారు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆరంభంలో రోజుకు రూ.లక్షా 50వేలు చెల్లించి రాత్రుల్లో ఇసుకను తరలించుకోవాలని గ్రామకమిటీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ ముందుగానే బయటపెట్టడంతో ఇసుక అక్రమ రవాణాకు బ్రేక్‌పడింది. తాజాగా సోమవారం ఉదయం నుంచి బట్టాపూర్ పెద్దవాగులో ఇసుక తవ్వకాలను ప్రారంభించారు. ఇందుకోసం ఒక్కో ట్రాక్టర్‌కు రూ.50వేలు గ్రామకమిటీకి చెల్లించాలనే ఒప్పం దం చేసుకున్నట్లు సమాచారం. అదే విధంగా ట్రిప్పుకు రూ.500 చెల్లించాలని నిర్ణయిం చినట్లు తెలిసింది. ట్రిప్పుకు వసూలు చేసే డబ్బులు అధికారుల మామూళ్ల కోసమని, మొత్తం 34 ట్రాక్టర్లకు సంబంధించి ఒక్కో ట్రాక్టర్‌కు రూ.50వేల చొప్పున గ్రామకమిటీకి ముట్టినట్లు సమాచారం. ఉదయమే గ్రామకమిటీకి డబ్బులు కట్టినవారంతా ట్రాక్టర్లను వాగులోకి మోహరించి ఇసుక తవ్వకాలను ప్రారంభించారు. ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తు న్నా పట్టించుకునే వారే కరువయ్యారు.
బట్టాపూర్ శివారులో సోమవారం ఇసుక తవ్వకాలు చేపట్టారు. అయితే పక్కనే ఉన్న మెండోరా మండ లం వెల్కటూర్ గ్రామకమిటీ తమ గ్రామ సరిహద్దులోకి వస్తుందనే ఫిర్యాదు చేయడంతో ఇసుక అక్రమ రవాణాకు బ్రేక్‌పడింది. వెల్కటూర్ గ్రామకమిటీ ఫిర్యాదు చేయడంతో ఏర్గట్ల పోలీసులు వచ్చి బట్టాపూర్ గ్రామకమిటీతో మాట్లాడినట్లు సమాచారం. కానీ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా ఏ ఒక్క ట్రాక్టర్‌ను పోలీసులు ఎందుకు పట్టుకోలేదన్నదానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బట్టాపూర్ నుంచి కమ్మర్పల్లి వరకు ఇసుక ట్రాక్టర్లు వచ్చినా అధికారులకు తెలియకుండా ఉంటుందా అనేది సమాధానం లేనిప్రశ్న. ఇసుక దందా విషయంలో సీపీ సీరియస్‌గా ఉన్నా మండలస్థాయి పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు, రెవెన్యూ అధికారులు కూడా ఏం చేస్తున్నారనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏర్గట్ల మండలం దోంచంద, గుమ్మిర్యాల్ గ్రామాల్లో కూడా రాత్రివేళ ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. గోదావరిలో తవ్వకాలు చేపట్టి రాత్రుల్లో లారీల్లో పంపిస్తున్నారు. ఈ తతంగం నిత్యం కొనసాగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. తడ్పాకల్లో ఇసుక అక్రమ రవాణాను గ్రామస్తులు నిలిపివేయించారు. ఒక గ్రామంలో ఆపివేయడం, మరో గ్రామంలో ఇసుక అక్రమ రవాణాకు ఊతమివ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుకాసురులు తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నా పోలీసులు, రెవెన్యూ అధికారులు ఉదాసీనంగా ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.