బోధన్/మోర్తాడ్/బాన్సువాడ/బిచ్కుంద, డిసెంబర్ 28: ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, నిబంధనలను ఉల్లంఘిస్తూ జరిగిన ఇసుక అక్రమ రవాణాపై ‘నమస్తే తెలంగాణ’ యుద్ధం ప్రకటించింది. రెండేండ్లుగా మంజీరానది, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న వాగుల్లో యథేచ్ఛగా కొనసాగిన ఇసుక దోపిడీపై అనేక కథనాలను ప్రచురించింది. బోధన్, మోర్తాడ్, బిచ్కుంద, బాన్సువాడ మండలాల్లో ఇసుకాసురుల ఆగడాలను వెలుగులోకి తెచ్చింది. అధికార పార్టీ అండతో ఇసుక మాఫియా పేట్రేగిపోతున్న తీరును కథనాల్లో ఎండగట్టింది.
ఉమ్మడి జిల్లాలో మంజీరా నదితో పాటు వాగుల్లో ఇసుక తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిన తీరును లైవ్ ఫొటోలతో చూపించింది. ఈ కథనాలు అధికార యంత్రాంగంలో ప్రకంపనలు సృష్టించాయి. కొన్నిసార్లు ఈ కథనాలకు స్పందన వచ్చింది. కొన్ని ఇసుక క్వారీలు ‘నమస్తే తెలంగాణ’ కథనాలతో మూతపడ్డాయి. బోధన్ డివిజన్లోని ఖండ్గావ్, సిద్ధాపూర్ ఇసుక క్వారీల్లో జరుగుతున్న అక్రమాలను నమస్తే తెలంగాణ వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ కథనం అధికార యంత్రాంగంతోపాటు అధికార పార్టీ వర్గాల్లోనూ కలకలం సృష్టించింది. దీంతో మంజీరా నదిలోని ఖండ్గావ్, సిద్ధాపూర్ క్వారీలు వెంటనే మూసివేశారు.