నిజామాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కామారెడ్డి ‘ఖజానా’లో పని చేసే కొందరు బరితెగించారు. కార్యాలయానికి వచ్చే వారి నుంచి అక్రమ వసూళ్లకు తెర లేపారు. జీతభత్యాలు, పింఛన్ మంజూరు చేయడంలో ట్రెజరీ శాఖదే కీలక పాత్ర. కలెక్టర్ మొదలుకుని కింది స్థాయి అటెండర్ వరకు ఎవరికైనా ఏ బిల్లు మంజూరు కావాలన్నా ఖజానా శాఖ తలుపు తట్టాల్సిందే. ఇదే అదనుగా భావిస్తున్న ట్రెజరీ శాఖలోని సిబ్బంది కొందరు బిల్లులకు సంబంధించిన ఫైళ్లను కదిపేందుకు చేయి చాస్తున్నారు.
పైకం ఇవ్వకుంటే ఫైలు ముందుకు కదపరనే అపవాదును మాటగట్టుకున్న ఇక్కడి సిబ్బంది.. ఉద్యోగులనే కాదు, రిటైర్డ్ ఉద్యోగులతో పాటుగా కొత్తగా జాబుల్లో చేరిన వారినీ వదలడం లేదు. తమ వసూళ్ల దందాలో కొత్త, పాత అనే తేడా లేకుండా అందరి వద్ద వసూళ్లు చేస్తున్నారు. లేదంటే ముప్పు తిప్పలు పెడుతున్నారు. కామారెడ్డి ట్రెజరీలో బహిరంగంగానే వసూళ్ల పర్వం కొనసాగుతున్నప్పటికీ పట్టించుకునే వారు కరువయ్యారు. కలెక్టరేట్ ప్రాంగణంలోనే ఈ ఆఫీస్‌లో పని చేసే కొందరు ఉద్యోగులు.. పొద్దున ఆఫీస్ మెట్లు ఎక్కిన కాడి నుంచి మొదలు తిరిగి విధులు ముగించుకునే దాకా వసూళ్లలోనే మునిగి తేలుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
డీఎస్సీ 2024లో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారి నుంచి.. ఎంప్లాయ్ ఐడీ కోసం వసూళ్లు చేస్తున్నారు. ఒక్కొక్కరికీ రూ.300 చొప్పున బేరం పెట్టారు. బహిరంగంగానే ఫోన్ పే, గూగుల్ పేలు సైతం ఆఫర్ అందిస్తున్నారు. ఆగస్టు నెలలో ఓ మహిళా టీచర్ పదవీ విరమణ చేశారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలకు సంబంధించిన ఎరియర్స్‌తో పాటు డిసెంబర్ నుంచి రెగ్యులర్‌గా వచ్చే పింఛన్ రావాల్సి ఉంది. డబ్బులు ఇవ్వనిదే ఫైల్ ముందుకు పోదని ట్రెజరీ సిబ్బంది సదరు రిటైర్డ్ ఉపాధ్యాయురాలికి నేరుగానే చెప్పేశారు. ఫించన్ ఇప్పట్లో రాదంటూ ఖరాకండిగా చెప్పడంతో ఆమె లబోదిబోమనాల్సి వచ్చింది. మరో శాఖకు చెందిన ఉద్యోగికి తన కూతురు పెళ్లి నేపథ్యంలో అత్యవసరంగా డబ్బులు అవసరమయ్యాయి.
చేసేది లేక తన జీపీఎఫ్ నుంచి కొంత మొత్తం డబ్బులు విత్ డ్రా చేసుకోవాలని సంబంధిత ఫారాలన్నీ నింపి అందజేశాడు. డబ్బులు మంజూరయ్యే సందర్భంలో ట్రెజరీ కార్యాలయానికి ఫైల్ చేరింది. ఒక్క సంతకంతో కావాల్సిన పనికి ఒకటికి పది సార్లు తిరిగినా పట్టించుకోలేదు. దీంతో విసిగిపోయిన సదరు ఉద్యోగి తమ సంఘం నేతకు సమాచారమిచ్చాడు. సదరు ఉద్యోగ సంఘం నాయకుడు జోక్యం చేసుకోవడం, మామూళ్ల వ్యవహారాలు నడపడంతో ట్రెజరీలో ఫైలు ముందుకు కదిలింది. ప్రమోషన్లు వచ్చి ఈ మధ్యే బిల్లులు పెట్టుకున్న కొంత మంది ఉపాధ్యాయులకు ఖజానా శాఖ సిబ్బంది నేరుగా ఫోన్లు చేసి మరీ రూ.500 చొప్పున డబ్బులు డిమాండ్ చేయడం గమనార్హం. ఎల్లారెడ్డి, బాన్సువాడ ట్రెజరీల్లోనూ ఇలాగే అవినీతి జరుగుతున్నదని ఉద్యోగులు వాపోతున్నారు.
కామారెడ్డి జిల్లా ట్రెజరీ కార్యాలయంలో జరుగుతున్న అక్రమ వసూళ్లపై అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లాం. ఉద్యోగ విరమణ నుంచి మొదలు పెడితే పెన్షన్ ప్రపోజల్స్ పంపడం దాకా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. 2024 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు ట్రెజరీ ఐడీ కేటాయించడానికి కూడా డబ్బులు తీసుకోవడం దారుణం. ఇదే విషయాన్ని అసిస్టెంట్ డైరెక్టర్‌కు విన్నవించాం.
– చకినాల అనిల్, టీపీటీఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు
కామారెడ్డి జిల్లా ట్రెజరీ కార్యాలయం అవినీతికి మారుపేరుగా నిలిచింది. జిల్లా ఏర్పాటు నుంచే అవినీతి రోగం పట్టుకున్నది. గతంలో ఇక్కడ పని చేసిన జిల్లా ట్రెజరీ అధికారులను పూర్వపు కలెక్టర్లు తీవ్ర స్థాయిలో మందలించిన ఘటనలు అనేకం ఉన్నాయి. అయినప్పటికీ వసూళ్ల పర్వంలో డీటీవోలో మార్పు రావడం లేదు. ఇందులో ఉద్యోగ సంఘం పేరు చెప్పుకునే ఓ వ్యక్తి సైతం అవినీతిని పెంచి పోషిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
ఎవరైనా ఎదురు తిరిగితే సంఘం పేరుతో బెదిరిస్తున్నట్లు చెబుతున్నారు. ట్రెజరీ కార్యాలయంలో జరుగుతున్న అవినీతికి.. అన్ని శాఖల ఉద్యోగులూ బాధితులుగానే మారారు. అవినీతిని సహించని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే అక్రమ వసూళ్ల పర్వం నడుస్తుండడం గమనార్హం. ఉన్నత ఉద్యోగుల కళ్లు గప్పి మరీ వసూళ్లు చేస్తున్న ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ చేస్తే వీరి బాగోతాలు వెలుగు చూస్తాయని బాధితులు చెబుతున్నారు.