ACB | వినాయక నగర్, జులై 2 : నిజామాబాద్ జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ మాజీ సూపరింటెండెంట్ కే మల్లారెడ్డికి సంబంధించి అక్రమ సంపాదన తాజాగా సుమారు మరో రూ.రెండు కోట్ల వరకు బయటపడిందని అవినీతి నిరోధక శాఖ అధికారుల ద్వారా తెలిసింది. గత పది రోజుల క్రితం ఏసీబీ అధికారులు మల్లారెడ్డి, ఆయన బంధువులకు సంబంధించిన ఇళ్లతోపాటు ఆఫీస్ పై ఏకతాటిగా 11 చోట్ల దాడులు నిర్వహించిన విషయం తెలిసింది. ఆ దాడిలో మాజీ ఈఎస్ వద్ద నుండి కోట్ల రూపాయల అక్రమాస్తులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకొని, ఆయనపై కేసు నమోదు చేసి, నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. దీంతో కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. దీంతోపాటు మల్లారెడ్డిని ఎక్సైజ్ శాఖ నుండి సస్పెండ్ చేశారు. ఆ సమయంలో హైదరాబాదులోని పలు బ్యాంకుల్లో మల్లారెడ్డికి సంబంధించిన లాకర్లు ఉన్నట్లుగా అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు.
ఆ లాకర్లను తెలిసేందుకు ఏసీబీ అధికారులు కోర్టు నుండి అనుమతి తీసుకొని బుధవారం రాత్రి వరకు మల్లారెడ్డికి సంబంధించిన రెండు బ్యాంకు లాకర్లను తెరిచారు. ఆ లాకర్లలో ఒక లాకర్ నుండి 1.25 కేజీ బంగారం, మరో లాకర్లు 1 కేజీ వెండిని ఏసీబీ అధికారులు గుర్తించారు. మల్లారెడ్డి వద్ద నుండి పది రోజుల క్రితం స్వాధీనం చేసుకున్న అక్రమ ఆస్తులలో తాజాగా ప్రస్తుతం మళ్లీ రూ.కోటి 82.40 లక్షల అక్రమ ఆదాయాన్ని గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. లాకర్ లోంచి బయటకు తీసిన బంగారం, వెండి నీ అవినీతి నిరోధక శాఖ అధికారులు సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేసినట్లు తెలిసింది.