ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో మెట్ట పంటలు అధికంగా దెబ్బతింటాయని రుద్రూర్ పరిశోధనా స్థానం సేద్య విభాగం శాస్త్రవేత్త సురేశ్ అన్నారు. సోయాచిక్కుడు, కంది, పత్తి, మక్కజొన్న పంటలే కాకుండా వరి, పసుపు పంటల్లో కూడా జాగ్రత్త చర్యలు పాటిస్తే పంట నష్టపోకుండా కాపాడుకోవచ్చని సూచించారు. ఆశించిన దానికన్నా ఎక్కువగా వర్షాలు కురవడంతో మెట్ట పంటల్లోని చేలల్లో నీరు నిల్వ ఉండి మొక్కలు కుళ్లిపోయి చనిపోయే అవకాశం ఉంటుందని చెప్పారు. చీడపీడలు ఎక్కువగా ఆశించే అవకాశం ఉన్నదని, వివిధ రకాల పంటల్లో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను ఆయన వివరించారు.
-రుద్రూరు, జూలై 23
వరి: ప్రస్తుతం జిల్లాలో వరినాట్లు కొన్ని ప్రాంతాల్లో పూర్తయ్యాయి. ఒకవేళ నారుమడి దశలోనే ఉంటే నారు దెబ్బతినకుండా లీటరు నీటికి 20గ్రా యూరియా లేదా 5 గ్రా 19ః19ః19ను ఐదు రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి. నాట్లు పూర్తయి పిలకలు వచ్చే దశలో ఉన్న వరిలో నీటిని పూర్తిగా తీసివేసి యూరియా 20-25 కిలోలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 15కిలోల చొప్పున కలిపి బూస్టర్ మోతాదుగా పొలంలో వేసుకోవాలి. నాట్లు వేసిన పొలాలు పూర్తిగా మునిగి మొక్కల సంఖ్య దెబ్బతింటే ఆ పొలాలను దమ్ముచేసి మధ్య, స్వల్పకాలిక రకాలతో నేరుగా విత్తుకోవాలి.
సోయా చిక్కుడు:జిల్లాలో వరి తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడే పంట సోయా చిక్కుడు. అధిక వర్షాలతో నీరు నిలిచి మొక్క గిడస బారిపోకుండా ఉండేందుకు మల్టీ -కె (13-0-45) లేదా పాలీఫీడ్ (19ః19ః19) 10 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆకాశం మబ్బులతో కూడుకొని ఉన్నందున ఆకుమచ్చ తెగుళ్లు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కార్బెండజిమ్+మాంకోజెట్ 2.5గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే తెగుళ్లను నివారించుకునే అవకాశం ఉన్నది.
కంది : మెట్ట పంటల్లో కంది ప్రధానమైనది. నేలలో అధిక తేమను తట్టుకోలేదు. పంట నష్టాన్ని తగ్గించుకోవడానికి మల్టీ -కే (13-0-45)/పాలీఫీడ్ (19ః19ః19) 10గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో పైటాప్తొర ఎండు తెగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నివారణకు మెటలాక్సిల్ 2 గ్రా లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటర్ నీటికి కలిపి పంపు నాజిల్ తీసి వేసి తెగులు సోకిన మొక్కల చుట్టూ తడిపితే తెగులు ఉధృతి, వ్యాప్తిని నివారించుకోవచ్చు.
మక్కజొన్న:మక్కజొన్న సాధారణంగా ఎక్కువ నీటిని, అధిక తేమను తట్టుకోలేదు. వీలైనంత త్వరగా నీటిని చేను నుంచి బయటికి పంపేలా ఏర్పాటు చేసుకోవాలి. నీటిని కాలువల ద్వారా బయటికి తీసివేసి 25కిలోల యూరియా, మూరేట్ ఆఫ్ పొటాష్ 15 కిలోలు ఎకరానికి వేసుకుంటే అధిక వర్షాల ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మక్కజొన్నలో అధిక తేమ, వర్షంతో నేల ద్వారా పోషకాలను గ్రహించలేని స్థితిలో ఉంటుంది. దీంతో పంటలో భాస్వరం లోపిస్తుంది. నివారణకు 10గ్రా. డీఏపీ లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి. లేదా మల్టీ -కే (13-0-45)/పాలీఫీడ్ (19ః19ః19) 10 గ్రా. లేదా 20 గ్రా. యూరియా లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
Nizamabad4
పత్తి : పత్తి పంట సాగులో అధిక వర్షాలతో ముఖ్యంగా నల్లరేగడి నేలల్లో నేలపై నీరు నిలవడం, అధిక మోతాదులో తేమ ఉండడంతో వడలు తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆకుమచ్చ తెగులు కూడా వచ్చే అవకాశం ఉంది. పత్తి పంట ఎండిపోవడం గమనించిన చోట వడలు తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 30గ్రా. 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. పిచికారీ చేసేటప్పుడు స్ప్రేయర్ నాజిల్ తీసివేసి వడలు సోకిన మొక్కల చుట్టుపక్కల తడిపితే వడలు తెగులు పొలంలో విస్తరించకుండా కాపాడుకోవచ్చు. ఆకాశం మేఘావృతమైన పరిస్థితుల్లో ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నివారణకు (స్ప్రింట్) కార్బండిజమ్+మాంకోజెట్ 2.5 గ్రా లీటరు నీటికి కలిపి 5-7 రోజుల వ్యవధిలో రెండుసార్లు మొక్కల అడుగు భాగం తడిచేలా పిచికారీ చేయాలి. పంట గిడస బారిపోకుండా పొలంలో నీటిని తీసేసి పైరుపై మల్టీ -కే (13-0-45)/పాలీఫీడ్ (19ః19ః19) 10గ్రా. లీటరు నీటికి లేదా 2 శాతం యూరియాను 3-4 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. నేల ఆరిన తర్వాత ఎకరానికి 25 కిలోల యూరియా, 10కిలోల పొటాష్ ఎరువులను వేసే అంతర కృషి జరపాలి. ఆలస్యంగా విత్తిన పంటలో సరైన మొక్కల సంఖ్య పాటించడానికి మొక్కలు మొలవని చోట మరలా విత్తుకోవాలి.
పొలాల్లో నీరుంచొద్దు..
సోయాచిక్కుడు, మక్కజొన్న, పత్తి, కంది, పసుపు, వరి, కూరగాయ పంటల్లో నీరు నిల్వకుండా ఎప్పటికప్పుడు బయటికి వెళ్లేలా ఏర్పాట్లు చేసుకోవాలి. వర్ష సూచన ఉన్నంతవరకూ ఏ పంటలోనైనా పురుగు మందులు పిచికారీ గానీ రసాయన ఎరువులు నేలపై వేయడం గానీ చేయకూడదు. లేదంటే అన్నీ వృథా అవుతాయి. వర్షాలు పూర్తిగా తగ్గాక అవసరమగు ఎరువులను వేసుకోవాలి. అధిక వర్షాలతో పంట మొక్కలు, కూరగాయ మొక్కలపై ప్రభావం పడుతుంది. పంటల్లో నారు కుళ్లు తెగుళ్లు ఆశిస్తాయి. వర్షం తగ్గుముఖం పట్టిన వెంటనే కాపర్ఆక్సీక్లోరైడ్ ద్రావణాన్ని నేలతడిచేలా పిచికారి చేయాలి. మరిన్ని వివరాలకు 8978672595 నంబరులో సంప్రదించాలి.
– డాక్టర్ ఎం. సురేశ్, శాస్త్రవేత్త (సేద్య విభాగం), కేవీకే రుద్రూర్