ధర్పల్లి, నవంబర్ 2 : రెండు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు ముత్యాల చెరువు ప్రాజెక్టు తెగిపోయి ఆ గ్రామానికి వెళ్లే రోడ్డు బ్రిడ్జి వద్ద మొత్తం కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు సాగడం కష్టంగా మారింది. ఆ గ్రామం నుంచి మండల కేంద్రానికి, జిల్లా కేంద్రానికి రావడానికి అదే ప్రధాన రహదారి. తమకు ఉన్న ఏకైక మార్గం భారీ వర్షాలతో దెబ్బతిన్నదని.. రెండు నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వాగులో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న రోడ్డు మీదుగా ద్విచక్ర వాహనాలను ప్రమాదకరంగా నడుపుతూ ప్రయాణాలు సాగిస్తున్నారు ధర్పల్లి మండలంలోని కోటాన్పల్లి గ్రామస్తులు. ఇక పంటలు చేతికి వచ్చి.. ధాన్యం విక్రయించాల్సి ఉండగా.. దారి లేకపోవడంతో కాంటాలు కావడం లేదు. ధాన్యం రాశులన్నీ.. కేంద్రాల్లోనే ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు మండలంలోని నడిమితండా అటవీ ప్రాంతంలో ఉన్న ముత్యాల చెరువు ప్రాజెక్టు తెగిపోయింది. దీంతో రహదారి పూర్తిగా దెబ్బతిన్నది. బీరప్ప తండా, కోటాన్పల్లి గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. పొలాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. నీటి ప్రవాహం తగ్గిన అనంతరం ద్విచక్ర వాహనాలు వెళ్లే విధంగా రైతులు, గ్రామస్తులు కలిసి వాగులో దారి ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇటీవల మళ్లీ కురిసిన వర్షాలతో ఆ దారి కూడా పూర్తిగా దెబ్బతిన్నది.
హోన్నాజీపేట్ సొసైటీ ఆధ్వర్యంలో వారం క్రితం కోటాన్పల్లి గ్రామం లో నామమాత్రంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని అధికారులు ప్రారంభించారు. కేంద్రాన్ని ప్రారంభించినా.. కొనుగోళ్లు మాత్రం చేపట్టడం లేదు. అప్పటి నుంచి నేటి వరకు ఒక్క బస్తా కూడా కాంటా చేయలేదు. దీంతో ధాన్యం కోసి, కొనుగోలు కేంద్రానికి తరలించిన రైతులు.. ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి ధాన్యం ఆరబోయడం.. కుప్పలు చేయడంతో సరిపెట్టుకుంటున్నారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి ధాన్యం తడిసి అక్కడక్కడ మొలకలు వచ్చాయని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తాము ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. ఒక్క అధికారి కానీ, నాయకుడు కానీ కనీసం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. వెంటనే కొనుగోళ్లు చేపట్టి.. ధాన్యాన్ని తరలించే ఏర్పాట్లు చేయాలని రైతులు వేడుకుంటున్నారు
ధర్పల్లి నుంచి హోన్నాజీపేట్ గ్రామం మీదుగా బీరప్ప తండా, కోటాన్పల్లి గ్రామా నికి వచ్చే మార్గమధ్యలో వాగు పై ఉన్న బ్రిడ్జి పూర్తిగా తెగిపోయింది. దీంతో మా గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. దారి లేక ధాన్యం కొనుగోళ్లు కూడా సాగడం లేదు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలు ఎక్కడివే అక్కడే ఉన్నాయి. ధాన్యం పూర్తిగా పాడైపోయే పరిస్థితి నెలకొన్నది. దొన్కల్, గౌరారం గ్రామాల మీదుగా ధాన్యాన్ని తరలించి రైతులను ఆదుకోవాలి.
-చాతరబోయిన రాములు, మాజీ సర్పంచ్, కోటాన్పల్లి