పిల్లలను ఇంగ్లిష్ మీడియం చదివించాలనే తపన.. భారమైనప్పటికీ ప్రైవేటు పాఠశాలలకు పంపడంతో ప్రభుత్వ పాఠశాల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఒకప్పుడు విద్యార్థుల్లేక వెలవెలబోయిన ఆ పాఠశాల ప్రస్తుతం సందడిగా మారింది. గ్రామస్తుల సహకారంతో ఆరేండ్లుగా నిర్విఘ్నంగా ఆంగ్లమాధ్యమ బోధన సాగుతున్నది. గ్రామస్తుల దృఢసంకల్పంతో పాఠశాల పూర్వవైభవాన్ని సంతరించుకున్నది. రెంజల్ మండలం బోర్గాం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఇతర బడులకు ఆదర్శంగా నిలుస్తున్నది. రాష్ట్రప్రభుత్వ తాజా నిర్ణయంతో పాఠశాలలో మరిన్ని సౌకర్యాలు మెరుగవు తాయని గ్రామస్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
రెంజల్, ఫిబ్రవరి 11 : రెంజల్ మండలంలోని బోర్గాం గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. పిల్లలందరూ ఇంగ్లిష్ మీడియం కోసం ప్రైవేటు బాట పట్టడంతో విద్యార్థులు లేక వెలవెలబోయింది. 2016 సంవత్సరంలో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 40కి తగ్గింది. ప్రైవేటు పాఠశాలల్లో వేలాది రూపాయల ఫీజులు కట్టలేక విసిగి వేసారి గ్రామస్తులంతా ఒక్కటయ్యారు. సర్కారు బడిలోనే ఆంగ్లమాధ్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపబోమని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఇంగ్లిష్ మీడియాన్ని ప్రారంభించేందుకు విన్నవించుకోగా విద్యాశాఖ అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.40 విద్యార్థులు, అదనంగా మరో నలుగురు విద్యావలంటీర్లతో ప్రారంభమైన పాఠశాలలో నేడు విద్యార్థుల సంఖ్య 170కి చేరుకున్నది.ఒకప్పుడు విద్యార్థులు లేక వెలవెలబోయిన పాఠశాల నేడు సందడిగా మారింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనతో ఈ పాఠశాల ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది. గ్రామస్తులు, పాఠశాల యాజమాన్య కమిటీ సహకారం.. ఉపాధ్యాయుల సమష్టి కృషితో ఐదేండ్లుగా మంచి ఫలితాలు వస్తున్నాయి. మండలంలోని ఇతర గ్రామాల్లో సైతం ఆంగ్లమాధ్యమాన్ని ప్రారంభించేందుకు ఈ పాఠశాల స్ఫూర్తిగా నిలుస్తున్నది.
సర్కారు పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం. ‘మన ఊరు- మన బడి’కి పూర్తి సహకారం అందిస్తాం. మాతృ భాషతో పాటు ఇంగ్లిష్ నేర్చుకోవడంలో తప్పు లేదు. భాషపై విద్యార్థులకు పట్టు వస్తుంది. విద్యార్థులను ఇంగ్లిష్ మీడియంలోనే చదివించాలని ఉత్సాహం చూపుతున్నారు.
-బి.హన్మంత్‌రావు, ప్రధానోపాధ్యాయుడు, బోర్గాం
ప్రస్తుత సమాజంలో ఇంగ్లిష్ అవసరమని గమనించి గ్రామంలోనే ఇంగ్లిష్ మీడియం పాఠశాలను ప్రారంభించాం. ఇప్పుడున్న సమయంలో ఇంగ్లిష్ వస్తేనే కొలువులు దొరుకుతున్నాయి. సర్కారు బడుల్లో పేదలకు భారం లేకుండా ఇంగ్లిష్ మీడియం ప్రారంభించడం హర్షణీయం. పాఠశాలలో మరిన్ని సౌకర్యాలు కల్పించునేందుకు అవకాశం దొరికింది.
-పుట్టి నడిపి నాగన్న, ఎస్ఎంసీ చైర్మన్
అమ్మ ఒడి లాంటి మన ఊరి బడి
విద్యార్థుల ఆనంద సందడి
చిన్నారుల జీవితాలకు
చిరు నవ్వుల మల్లెల వనం
ఆట పాటల పల్లె ప్రకృతి వనం
మన ఊరి విద్యాలయం
పల్లెకు నిలువెత్తు దర్పణం
సంస్కార విలువలు నేర్పే నిత్య పచ్చతోరణం
చీకటి మయమైన పల్లె జీవితాలకు
వెలుగనే విద్యను ప్రసాదించే
భాస్కర భారతి దేవాలయం
పల్లె విద్యాలయం
బాధ్యతను గుర్తెరిగిన ప్రజా ప్రభుత్వ విధానం
మన ఊరి బడికి అందిన వరం
బడి బాధ్యతను తీసుకుందాం
ప్రజా ప్రభుత్వానికి
చేయూత అందిద్దాం..
-ప్రవీణ్ శర్మ, తెలుగు పండిట్, జడ్పీ ఉన్నత పాఠశాల, తడ్పాకల్, ఏర్గట్ల మండలం