ఆర్మూర్‌టౌన్, అక్టోబర్ 1: కాంగ్రెస్ అంటేనే కూల్చడాలు, కాల్చడాలు, పేల్చడాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. గతంలో ఇందిరాగాంధీ గరీబీ హఠావో అంటే.. ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డి గరీబో కో బగావో అన్న నినాదంతో పని చేస్తున్నారని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హైడ్రా పేరుతో హైదరాబాద్ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. హైడ్రా విషయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు ఆయన హ్యాట్సాప్ చెప్పారు. హైడ్రాను వెంటనే రద్దు చేయాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. పది నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని కుంభకోణాలేనని, పంచభూతాలను దోచుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. రైతుల రుణాలను మాఫీ చేయలేదన్న మాజీ ఎమ్మెల్యే.. రుణాలు మాఫీ చేయకపోతే రైతులే తరిమి కొడతారని హెచ్చరించారు. మహాలక్ష్మి కింద ప్రతి మహిళకూ రూ.2,500 ఇస్తామని, పింఛన్లు రెట్టింపు చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. హామీలు అమలు చేయలేకే హైడ్రా పేరుతో హైడ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.