నిజామాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలిచ్చింది. ఎన్నికల ప్రచారంలో నోటికొచ్చినట్లుగా ప్రసంగించారు. ప్రజలను మభ్యపెట్టారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటను తప్పుతున్నారు. చిత్తశుద్ధితో హామీలు అమలు చేయడం లేదు. 32 నెలల పరిపాలనలో చేసిందేమీ లేకపోయినప్పటికీ ఉచిత ప్రసంగాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లతో పాటుగా పీసీసీ చీఫ్, డీసీసీ అధ్యక్షులు సైతం అన్ని హామీలు అమలు చేసినట్లుగా అబద్ధాలు వల్లిస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్న పత్రికల్లో తప్పుడు వార్తలతో ప్రజలను మభ్యపెట్టి పూట గడుపుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ రూ.4వేలు ఇస్తామంటూ భారీ ప్రకటనలు చెప్పారు. పైసా పెంచలేదు.
వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులను అడుగడుగునా మోసం చేస్తున్నారు. రెండున్నరేళ్లు దాటి దాదాపుగా మూడేళ్లకు దగ్గర పడుతున్న ఈ సందర్భంలో కొత్త పింఛన్లు ఇస్తామంటూ సర్కారు ప్రకటించింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం నిబంధనల సరళి లేదు. కొత్త పింఛన్లను వడపోసేందుకు ఇష్టారీతిన కొర్రీలు పెట్టారు. పింఛన్ ఆశతో దరఖాస్తు చేసే వారికి ఆదిలోనే నిరాశ ఎదురయ్యే పరిస్థితిని కల్పిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో లక్ష మంది ఆశావాహులు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూసున్నారు. వీరిలో ఎంత మందికి మోక్షం లభిస్తుందనేది గందరగోళం ఏర్పడింది.
అర్హులకు పింఛన్లు ఇస్తామని చెప్పి… ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడం విడ్డూరంగా మారింది. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఎడాపెడా పింఛన్లు కోత పెట్టింది. ఇప్పుడు నూతనంగా పింఛన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామంటూ రేవంత్ సర్కారు చెప్పుకుంటోంది. తొలగించిన స్థానంలోనే కొత్తవారికి చోటు కల్పించే కుట్ర కనిపిస్తోంది. అదనంగా పింఛన్లు పంపిణీ ఉత్తమాటే అన్నట్లుగా మారుతోంది. ఇష్టానుసారంగా నిబంధనలను రూపొందించి పింఛన్ మంజూరు పరిధిలోకి సామాన్య కుటుంబాలను దూరం చేసి ఏదో చేస్తున్నామనే స్థాయిలో ప్రగల్భాలు చెప్పుకుంటుండటంపై ప్రజలు మండిపడుతున్నారు.
గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పింఛన్ రూ.200 మాత్రమే ఉండేది. కేసీఆర్ పరిపాలనలో రూ.2,016 చేశారు. నిజామాబాద్ జిల్లాలో 2లక్షల 50వేల 610 మందికి నెలకు రూ.57.98కోట్లు చెల్లిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో అన్ని రకాల పింఛన్లు కలిపి 1లక్షా 62వేల మందికి లబ్ధి చేకూరుతోంది. నెలకు పింఛన్ల రూపంలో రూ.36.22కోట్లు నిధులు వెచ్చిస్తున్నారు.
అర్హులకు పింఛన్లు ఇస్తామని చెప్పుకుంటున్నప్పటికీ దరఖాస్తుదారులను వడబోసేందుకు కఠినమైన కసరత్తుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. నూతన పింఛన్ కోసం ఐప్లె చేసుకున్న వారికి ఆదిలోనే చెక్ పెట్టే విధంగా మార్గదర్శకాలను రూపొందించారు. ఇంట్లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్తో పాటుగా ప్రైవేటు ఉద్యోగులు, ఇతర రంగాల్లో నిపుణులు ఉంటే వారి తల్లిదండ్రులకు పింఛన్ మంజూరు లేనట్లే. కుటుంబానికి మూడు ఎకరాలకు మించి మాగాణి భూమి ఉన్నా పింఛన్ రాదు. 7.5ఎకరాల మెట్ట భూమి ఉన్నా సామాజిక పింఛన్ మంజూరు లేనట్లే. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షల ఆదాయం, అర్బన్ ఏరియాల్లో రూ.2లక్షలకు మించి కుటుంబ వార్షికాదాయం కలిగిన వారంతా అనర్హులుగానే ప్రభుత్వం గుర్తించనుంది.
ఎడాపెడా కోత పెట్టి తూతూ మంత్రంగా లబ్ధిదారుల జాబితాను రూపొందించడం ద్వారా ఈ ప్రక్రియను మమ అనిపించేందుకు ఇదంతా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చేయూత పథకం కింద సామాజిక పింఛన్లు మంజూరుకు లబ్ధిదారుల ఎంపిక కోసం జారీ చేసిన మార్గదర్శకాలు పరిశీలన చేస్తే ఆశావాహులకు నిరాశ మిగులుతోంది. పంద్రాగస్టు నుంచి రెండు లక్షల 25వేల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. అడుగడుగునా కొర్రీలు పెడుతూ కఠినమైన నిబంధనలు జారీ చేయడంపై ఆశావాహుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి వెలుగు చూస్తోంది.