మాచారెడ్డి/రాజంపేట, మార్చి 31 : చేతికొచ్చిన పంటలు కండ్ల ముందే ఎండుతుంటే రైతాంగం తల్లడిల్లుతున్నది. బోర్లు ఎత్తిపోయి పొలాలు నోళ్లు తెరుస్తుంటే ఆగమవుతున్నది. చి‘వరి’ తడి కోసం శక్తికి మించి రైతులు తండ్లాడుతున్నారు. పాత బోర్లు ఫ్లషింగ్ చేయిస్తున్నా ఫలితం లేదు. కొత్త బోర్లు వేయిస్తున్నా చుక్కనీరు రావట్లేదు. ట్యాంకర్లతో నీళ్లు పెడుతున్నా ఏమూలకు సరిపోవట్లేదు. పంట సాగుకు పెట్టిన పెట్టుబడితో పాటు చివరి తడి నీరందించేందుకు చేస్తున్న ఖర్చు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని రైతులు గుండెలు బాదుకుంటున్నారు. పదేండ్లలో గిట్లాంటి గోస ఎప్పుడూ పడలేదని గుర్తు చేసుకుంటున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
క‘న్నీటి’కష్టాలు..
ఉమ్మడి జిల్లాలోని అనేక మండలాల్లో సాగునీటి కష్టాలు రెట్టింపయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు ఎత్తిపోతున్నాయి. ప్రధాన ప్రాజెక్టులతో పాటు చెరువుల్లో నిల్వలు తగ్గుముఖం పట్టాయి. కాలువల ద్వారా వచ్చే నీళ్లు చివరి ఆయకట్టుకు అందడం లేదు. మరో నెల రోజులు, కనీసం రెండు, మూడు తడులు పెడితే కానీ పంటలు చేతికొచ్చే పరిస్థితి లేదు. కానీ ఇప్పటికే నీరందక వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. మాచారెడ్డి, రాజంపేట, ధర్పల్లి, సిరికొండ తదితర మండలాల్లో పరిస్థితి దారుణంగా ఉన్నది. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత పెరగడం, భూగర్భ జలాలు మరింత అడుగంటే పరిస్థితి ఉండడంతో సాగునీటి సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదమున్నది.
గిట్ల ఎప్పుడూ లేకుండే..
నాకు బుద్ధి తెలిసిన సంది ఎవుసం జేత్తున్న. యాట రెండు పంటలు తీత్తున్న. మూడు బోర్లతోటి ఎనిమిది ఎకరాలు పండిత్తున్న. 20 ఏండ్ల సంది బోర్లు ఎత్తిపోతే. ఈసారి ఏమైందో ఏం పాడో మూడిటికి మూడు ఎత్తేసినయ్.ఫ్లషింగ్ చేపిచ్చినా నీళ్లు రాలే. నాట్లు ఏసేతందుకు, మందులకు లచ్చ ఎనభై ఏలు, బోర్ల కోసం లచ్చ ఖర్చు పెట్టిన. రూపాయి కూడా అచ్చేటట్లు లేదు. సర్కారోళ్లే మమ్ముల్ని ఆదుకోవాలె.
– పల్లపు రాములు,ఎల్లంపేట, మాచారెడ్డి మండలం
రెండు బోర్లేసినా చుక్క రాలేదు..
నీళ్లకు రందీ లేదని రెండెకరాలల్ల వరి, ఎకరంలో మక్క వేసిన. పంట చివరి దశకొచ్చే సరికి బోర్లు ఎత్తిపోయినయ్. చేతికచ్చిన పంట కండ్ల ముందర ఎండుతుంటే దిక్కు తోచలే. ఎట్లయినా పంటను కాపాడుకోవాలని అప్పు తెచ్చి రెండు బోర్లు ఏసిన. చుక్క నీరు కూడా రాలేదు. పంటలు ఎండిపోయి లాగోడి మీద పడి అప్పులు పాలైనం.
అప్పు ఎట్ల తీర్చుడో ఏమో..
ఐదెకరాలల్ల వరి ఏసిన. మొన్నటి దాక మంచిగానే పోసిన బోర్లు పొలాలు పొట్ట కొచ్చే టైంల ఎత్తేసినయ్. చెర్లు, కుంటలల్ల నీళ్లు ఉంటే బోర్లు పోసేటియి. రెండు, మూడు తడులు పెడితే అడ్లు చేతికొత్తుండే. నీళ్లు లేక ఇడుసపెట్టిన. అప్పు తెచ్చి లాగోడి మీద పెట్టిన. ఇప్పుడు అది పడ్డది. ఎట్ల తీర్చాల్నో ఏమో అర్థమైతలేదు.
ఐదెకరాల పంట పోయింది..
మాచారెడ్డి మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన పల్లపు రాములుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. యాసంగిలో ఎనిమిది ఎకరాల్లో వరి వేశాడు. పైరు పొట్ట పోసుకునే దశలో ఉండగా సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఉన్న మూడు బోర్లు ఎత్తిపోయాయి. కండ్ల ముందే పంట ఎండుతుండడంతో అప్పు తెచ్చి బోర్లకు ఫ్లషింగ్ చేయించాడు. 500 ఫీట్ల లోతు వరకు ఫ్లషింగ్ చేయించినా నీటి చుక్క జాడ కరువైంది. రూ.లక్ష దాకా ఖర్చు పెట్టినా ఫలితం లేకపోవడంతో రాములు, ఆయన కుమారులు పంటపై ఆశలు వదిలేసుకున్నారు. ఐదెకరాలు ఇప్పటికే ఎండిపోగా, మిగిలన మూడెకరాల పంట చేతికొచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు.