ఖలీల్‌వాడి, మే 14 : బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డికు సుప్రీంకోర్టు భారీ ఊరట లభించింది. శంకర్పల్లి భూములకు సంబంధించి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, మోకిల పోలీస్స్టేషన్లలో నమోదైన అక్రమ కేసుల్లో ఆయనకు బిగ్ రిలీఫ్ లభించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే దర్యాప్తునకు సహకరించాలని కోర్టు జీవన్‌రెడ్డిని ఆదేశించింది. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నమోదైన అక్రమ కేసు అని జీవన్‌రెడ్డి తరపు న్యాయవాదులు ముకుల్ రోహిత్, ఎస్.నిరంజన్‌రెడ్డి, మహపూజ్ నజకీల వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది.
రాజకీయ కక్షసాధింపు చర్యలకు భయపడేది లేదని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యమకాలంలో అప్పటి సీమాంధ్ర కాంగ్రెస్ ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసులు తిరగతోడుతుండడమే కాకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తొలిరోజు నుంచే బూటకపు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు తనపై 40 కేసుల వరకు అక్రమంగా నమోదు చేసి వేధిస్తున్నారని పేర్కొన్నారు. 70 ఏండ్ల వృద్ధురాలైన తన తల్లి ఏం తప్పు చేశారని ఆమెను మానసికంగా హింసిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, బెదిరింపులకు లొంగేది లేదని స్పష్టం చేశారు. న్యాయస్థానాలపై తనకు అచంచలమైన విశ్వాసముందని పేర్కొన్నారు. తనను దెబ్బ తీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిస్తున్న అక్రమ కేసులపై న్యాయపోరాటం కొనసాగిస్తానని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే బీఆర్ఎస్లో కీలకంగా ఉన్న జీవన్‌రెడ్డిని టార్గెట్ చేసింది. ఎలాంటి తప్పులు చేయకపోయినా జీవన్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యులపై వేధింపుల పర్వానికి తెర తీసింది. ఏ తప్పులు జరగకపోయినా ఆర్మూర్‌లోని జీవన్‌రెడ్డి మాల్‌ను కాంగ్రెస్ నేతల ఒత్తిడి మేరకు అధికారులు సీజ్ చేశారు. దీనిపై జీవన్‌రెడ్డి చేసిన న్యాయపోరాటం ఫలించి మాల్ తెరుచుకున్నది. అసలు వివాదమే లేని శంకర్పల్లి భూములకు సంబంధించి కాంగ్రెస్ నేతల ప్రోద్బలంతో ఎవరో ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు మేరకు చేవెళ్ల, మోకిల పోలీసు స్టేషన్లలో జీవన్‌రెడ్డితోపాటు ఆయన సతీమణి రజితారెడ్డి, 70 ఏండ్ల వృద్ధురాలైన జీవన్‌రెడ్డి తల్లిపై అక్రమ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో జీవన్‌రెడ్డి సతీమణి, తల్లికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా అత్యున్నత న్యాయస్థానం తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంపై జీవన్‌రెడ్డి సంతోషం వ్యక్తంచేశారు.