కామారెడ్డిలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, నాయకులు నిట్టు వేణుగోపాల్, జూకంటి ప్రభాకర్‌రెడ్డి తదితరులు
నమస్తే తెలంగాణ యంత్రాంగం : కేంద్ర ప్రభుత్వం మరోసారి వంట గ్యాస్ ధర పెంచడాన్ని నిరసిస్తూ ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. కట్టెల పొయ్యిపై వంటావార్పు నిర్వహించారు. కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆందోళనలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. దరిద్రపు బీజేపీ పాలనలో మళ్లీ కట్టెల పొయ్యి వైపు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందని, ఆడబిడ్డల ఉసురుపోసుకుంటున్న మోదీ సర్కారుకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రం పేదోళ్ల కడుపుకొట్టి పెద్దోళ్లకు దోచిపెడుతున్నదని విమర్శించారు. నిరసన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ నగరంలో కట్టెల పొయ్యిపై వంట చేస్తూ నిరసన తెలుపుతున్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, మేయర్ దండు నీతూ కిరణ్ తదితరులు
గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లా భగ్గుమన్నది. గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్ ధర రూ.50 పెంచడంతోపాటు కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలపై భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన ఆందోళనలు మిన్నంటాయి. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఖాళీ సిలిండర్లతో రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ప్రధాన చౌరస్తాల్లో వంటావార్పు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలుచోట్ల రాస్తారోకోలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా,జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, డిచ్పల్లి మండల కేంద్రంలో ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉర్దూ అకాడమీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవి, జుక్కల్‌లో ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే జాజాల సురేందర్ తదితరులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
గ్యాస్‌సిలిండర్ ధర పెంపునకు నిరసనగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో చేపట్టిన ధర్నాలో వంట చేస్తున్న మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవి, వైస్ చైర్పర్సన్ ఇందూప్రియ, మహిళా నాయకులు
నిజామాబాద్‌లో చేపట్టిన నిరసనలో పాల్గొన్న మేయర్ నీతుకిరణ్, మహిళా ప్రజాప్రతినిధులు, నాయకులు
బోధన్‌లో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు
ఆర్మూర్‌లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళనలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత, బీఆర్ఎస్ నాయకులు