నవీపేట,జూన్ 16: మండలంలోని ధర్మారం గ్రామంలో సోమవారం దారుణం చోటుచేసుకున్నది. ఇతర స్త్రీలతో తండ్రి వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేని ఓ కూ తురు రోకలిదుడ్డుతో కొట్టి హత్య చేసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మారం గ్రామానికి చెందిన పల్లపు నర్సయ్య(54), నర్సవ్వ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. ఇద్దరి పెండ్లిలు చేయగా.. పెద్ద కూతురు భర్త మృతి చెందడంతో ఆమె ఇంటి వద్దనే ఉంటున్నది.
చిన్న కూతురు వర్షితను నిజామాబాద్ మండలం కొత్తపేటకు ఇవ్వగా భర్తతో గొడవ కారణంగా కొంత కాలంగా పుట్టింటి వద్దనే పిల్లలతో కలిసి ఉంటున్నది. తండ్రి నర్సయ్య కొంతకాలంగా పరాయి స్త్రీలతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీనిపై వారం రోజుల క్రితం నర్సయ్యతో పెద్ద కూతురు, భార్య నర్సవ్వ ఘర్షణ పడగా వారు నిజామాబాద్ వెళ్లి అక్కడే ఉంటున్నారు. కుటుంబంలో నిత్యం ఘర్షణలు చోటుచేసుకోవడంతో చిన్నకూతురు భరించలేకపోయింది.
సోమవారం మద్యం తాగి ఇంట్లో నిద్రిస్తున్న తండ్రిపై రోకలి దుడ్డుతో తలపై బలంగా కొట్టి చంపేసింది. విషయం తెలుసుకున్న నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై వినయ్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. నర్సయ్యను తన కూతురే రోకలి దుడ్డుతో దారుణంగా హత్యచేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదని, అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించినట్లు ఎస్సై వినయ్ తెలిపారు.