ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహాలు, అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ వేడుకల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.
ఖలీల్‌వాడి, జూన్ 2: కేసీఆర్ లేనిదే తెలంగాణ లేదని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిగాలతోపాటు ఆర్మూర్, రూరల్ మాజీ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం వినాయక్‌నగర్‌లోని అమరవీరుల పార్కులో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ.. తెలంగాణ కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరుల త్యాగాలను ఎప్పటికీ మరిచిపోలేమని అన్నారు. కేసీఆర్ తెలంగాణ సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమించారన్నారు. స్వరాష్ర్టాన్ని సాధించిన మహనీయుడు కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కేసిఆర్ పాలనే బాగుందని అంటున్నారని తెలిపారు. రైతులకు ఆపద్బాంధవుడు కేసీఆర్ అని పేర్కొన్నారు.
ప్రాణాలను లెక్క చేయకుండా తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ అని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రైతన్నలకు అండగా ఉన్న భగీరథుడు కేసీఆర్ అని, రైతుబంధు, రైతుబీమా ద్వారా రైతులను ఆదుకున్నాడని పేర్కొన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను అమలుచేయకుండా ప్రజలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. ముఖ్యంగా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రెండు పంటలకు రైతు బంధు ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదన్నారు. తెలంగాణ అంటేనే మింగుడు పడని, రాష్ట్రం ఏర్పడితే 11 రోజులు అన్నం తినకుండా ఉన్న పవన్‌కళ్యాణ్‌కు తెలంగాణలో ఏం పని ఉన్నదని ప్రశ్నించారు. ఏపీలో చేసింది సరిపోకా మళ్లీ తెలంగాణవైపు చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ లేని తెలంగాణ చూస్తున్నామని, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు.
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, అభివృద్ధి పథంలో నడిపించిన మహోన్నత నాయకుడు కేసీఆర్ అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. ఆనాటి మహాత్మాగాంధీని చూడలేకపోయినా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన ఈనాటి తెలంగాణ గాంధీ కేసీఆర్ అని పేర్కొన్నారు. ఉద్యమంలో కేసీఆర్ చూపిన త్యాగం, పట్టుదల, నాయకత్వం చిరస్మరణీయమని పేర్కొన్న ఆయన, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పెన్షన్లు వంటి సంక్షేమ పథకాలతో కోట్లాది కుటుంబాలకు భరోసా కల్పించారని వివరించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులతో తెలంగాణను దేశానికే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యత అని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం విశేషంగా కృషి చేసిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గమనిస్తున్నారని, గల్లీలో మళ్లీ కేసీఆర్ రావాలని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని తెలిపారు.తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వానికే ప్రజలు పట్టం కట్టబోతున్నారన్నారు. కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
బిచ్కుంద, జూన్ 2: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో 14 ఏండ్ల అలుపెరుగని ఉద్యమంలో అమరుల త్యాగాలు, విద్యార్థులు, ఉద్యోగులు, సబ్బండ వర్గాల సమష్టి పోరాట ఫలితంగానే తెలంగాణ సాధ్యమైందని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బిచ్కుందలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మినీ ట్యాంక్ బండ్ వరకు ర్యాలీగా బయల్దేరి వెళ్లి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ తొలిసీఎం కేసీఆర్ పదేండ్లలో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు.