చారిత్రక అవశేషాలు, ప్రాచీన కట్టడాలకు సాక్ష్యంగా విరాజిల్లుతున్నది నిజామాబాద్ జిల్లా. వేల ఏండ్ల క్రితం నుంచి ఎందరో మహారాజులు, మహావీరులకు రణక్షేత్రంగా నిలిచిందీ గడ్డ. ఇందుకు సాక్ష్యమే ఆనాటి అల్లకొండ.. నేటి బాల్కొండ. 4 వేల సంవత్సరాలకు పూర్వం నిర్మితమైన అల్లకొండ ఖిల్లా, చరిత్ర సంస్కృతికి ప్రతిబింబం. వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర కూటములు, కల్యాణ చక్రవర్తి, కాకతీయుల పాలన, ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యం ఆరంభమై అల్లా ఉద్దీన్ ఖిల్జీ, మహ్మద్ బిన్ తుగ్లక్, కుతుబ్ షాహి, మొగల్ సామ్రాజ్యం..4వేల ఏండ్ల నాటి రాష్ట్ర కూటుల కాలంలో ఆ తర్వాత కల్యాణ చాణక్యుల కాలం నాటి ఆనవాళ్లే ఈ కట్టడాలు. బాల్కొండ ఖిల్లాపై ప్రత్యేక కథనం..
బాల్కొండ, డిసెంబర్ 25: ఒకప్పటి ఇందూరు.. నేటి నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా దక్షిణ భారతదేశంలోనే అతి ప్రాచీన ప్రాంతం నాటి ‘అల్లకొండ’ నేటి బాల్కొండ అంటే అతిశయోక్తి కాదేమో. బాల్కొండ పరిసర ప్రాంతమైన పోచంపాడ్ దగ్గరలో ఉన్న కొల్హాపూర్ దగ్గర చరిత్రాత్మక సంధి యుగం నాటి అవశేషాలు, నాటి ఆనవాళ్లు ఇక్కడ లభించినట్లు ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ వీవీ కృష్ణశాస్త్రి తెలిపారు. ఆ కాలంలోనే బాల్కొండ పట్టణంగా పేరు గాంచింది. మొఘల్దీశ్ కాలం నాటి బాల్కొండలో ఉన్న గుట్టల్లో (ఖిల్లా) లభించిన రాతి పరిమాణం, సమాధులు, వస్తువులు, గాజులు, అలంకరణ సామగ్రిని చూస్తే అప్పటి ప్రజల జీవన విధానం ఊహించవచ్చునని చరిత్రకారుడు బీఆర్ నర్సింగ్‌రావు చెప్పారు.
ఆనాటి అల్లకొండ నుంచి ఢిల్లీ వరకు దేశ చరిత్రలో పేరొందిన ప్రఖ్యాతగాంచిన పురాతన ఖిల్లా ఈ అల్లకొండ. నేటి బాల్కొండ ఖిల్లా గురించి అరబ్బీ గ్రంథాల్లో వివరించిన కథనం ప్రకారం… ‘ఎల్లమ్మ’ వంశానికి చెందిన సుమారు క్రీస్తు శకం 1607 నాటి మల్లయోధులు ఎల్లయ్య, కొండయ్య అనే ఇరువురు సోదరులు. వీరు ఒకరోజు ఊరును చూసేందుకు వచ్చి ఇక్కడే ఎత్తైన కొండలో కోటను కడితే బాగుంటుందని నిర్ణయానికి వచ్చి ఖిల్లాను నిర్మించారు. అలనాడు సామంత రాజుల పాలన ఉండేదని, కోటలో శత్రువుల్ని చీల్చి చెండడానికి, యుద్ధ ప్రావీణ్యంలో సైనికులకు సోమక్షత్రీయులతో కఠోర శిక్షణ ఇచ్చే వారని, ఆ రోజుల్లో రాజకీయ వ్యవస్థ ఉండేదని తెలిసింది. క్షత్రియులు రాజస్థాన్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వలస వచ్చిన వారే. కొందరు విజయనగర సామ్రాజ్యంలో నిమ్మనాయుడు రాజుల వద్ద, మరికొందరు ఇతర ప్రాంతాల్లోని రాజుల వద్ద సైనికులుగా చేరిపోయారు. వీరంతా రాజస్థాన్ రాష్ట్రంలోని ఝున్-ఝునూ, జైపూర్ బికనీర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారే. ఏడు కుటుంబాల వారు మాత్రం చౌదరి దేవన్న, రామ్‌నారాయణ్ కుటుంబాల నేతృత్వంలో అల్లకొండకు శరణార్థులుగా వచ్చినట్లు తెలుస్తుంది. వీళ్లంతా వివిధ కళల్లో ఆరితేరినవారు. ముఖ్యంగా యుద్ధనైపుణ్యతను కలిగిన వారు కావడం విశేషం. ఆనాటి ‘అల్లకొండ’ మల్లయోధులైన ఎల్లయ్య, కొండయ్య అనే రాజుల వద్ద శత్రువులతో యుద్ధాలు చేసేందుకు 1607లో సైనికులుగా పనిచేసేవారు.
అల్లకొండ ఖిల్లా మొత్తం 29 ఎకరాల వైశాల్యంలో నిర్మితమై ఉంది. ప్రధాన కోట మధ్య కొండరాళ్లల్లో ఎల్లయ్య, కొండయ్య శిలావిగ్రహాలు చేయించారు. పక్కన ఖిల్లా మైసమ్మ ఆలయం ఉన్నది. 1972లో ఈ కోట పురావస్తు శాఖ ఆధీనంలోకి వెళ్లింది. ఈ కోటలోని సంపద రక్షణకు మాజీ సైనిక దళానికి చెందిన నర్సింహులును ఖిల్లా చౌకీదార్‌గా ప్రభుత్వం నియమించింది. వర్షాలు కురిస్తే ఇప్పటికీ ఆనాటి నాణేలు వరదతో కొట్టుకువస్తాయని, 1995 వరకు ఉన్న ఖిల్లా చౌకీదార్ నర్సింహులు తనకు దొరికిన నాణెలను పురావస్తు శాఖ అధికారులకు అందించే వాడని నర్సింగ్‌రావు వివరించారు. కోటకు నైసర్గికంగా సహజసిద్ధమైన పర్వతపంక్తులు ఉన్న ‘గిరి’ దుర్గంగా ఉండగా, దీనికి ఆరు ప్రవేశ సింహద్వారాలకు ‘నాగుపాము పడిగె’ ఆకారంలో ఆనాటి శిల్పకారులతో చెక్కబడి ఉన్నాయి. ఖిల్లా కోటలో అనేక ఫలవృక్షాలు, నెమలి విన్యాసాలు, విష, క్రూర జంతువులైన పాములు, అడవి పందులు, ఏదులు, జింకలు, సిల్వాయి, కుందేళ్లు మొదలగునవి సాయంత్రంపూట కనిపించడం విశేషం.
వేల సంవత్సరాల నాటి చారిత్రక కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది. బాల్కొండ ఖిల్లాకు పేరుప్రఖ్యాతులున్నాయి. ఇక్కడ ఉన్న కోటకు ప్రవేశ సింహద్వారాలు నాగపడిగె ఆకారంలో ఉన్నాయి. భావితరాలకు చరిత్రను వివరించేందుకు ఇవి ఉండాలి.
– బీఆర్ నర్సింగరావు, చరిత్రకారుడు
ఈ ఖిల్లాలో అత్తాకోడళ్ల బావులని మొట్టమొదటి రాజులైన ఎల్ల య్య, కొండయ్యలు నిర్మించారు. ఈ బావి లో ఒకవైపు మంచినీరు(కోడలి), మరోవైపు ఉప్పు నీరు (అత్త) ఉన్నాయి. ఇప్పటికీ ఈ బావిలో రెండు రకాల రుచులతో నీరు లభిస్తాయి. చరిత్రకు ఆనవాైళ్లెన బాల్కొండ ఖిల్లాను పరిరక్షించుకోవాలి.
– సిద్ధ సాయిరెడ్డి, పరిశోధకుడు