బోధన్, జూన్ 1: మలిదశ ఉద్యమంలో తెలంగాణ సాధనే ధ్యేయంగా బోధన్ పట్టణంలో సుదీర్ఘకాలంపాటు కొనసాగిన నిరాహారదీక్షలకు నాటి ఉద్యమనేత, తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్ఫూర్తిప్రదాతగా నిలిచారు. కేసీఆర్ అందించిన స్ఫూర్తితో నిరాహారదీక్షలతోపాటు వివిధ రూపాల్లో తెలంగాణ పోరు బోధన్‌లో ఉవ్వెత్తున లేచింది. తెలంగాణ ఉద్యమ చరిత్రలో బోధన్ ఓ పోరుగడ్డగా నిలిచింది. బోధన్‌లో తెలంగాణవాదులు జేఏసీగా ఏర్పడి ప్రారంభించిన నిరాహారదీక్షలకు చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్నది. ఒక పక్క రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ పర్యటిస్తూ సాగిస్తున్న పోరాటం.. స్థానికంగా బోధన్ ప్రాంతంలోని తెలంగాణవాదులకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది. బోధన్‌లో ఏదో ఆరు నెలలో.. ఏడాదో కాదు.. ఏకంగా 1519 రోజులపాటు తెలంగాణవాదులు నిరాహారదీక్షలు చేశారు. తెలంగాణ ఉద్యమకాలంలోనూ, తెలంగాణ ఆవిర్భావం అనంతరం కూడా హైదరాబాద్‌తో సహా పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో కేసీఆర్ బోధన్ నిరాహారదీక్షల విషయాన్ని తరచుగా ప్రస్తావించేవారు. బోధన్‌లో 2009 డిసెంబర్ 28న ప్రారంభమైన నిరాహారదీక్షలు 1519 రోజులపాటు.. అనగా 4 సంవత్సరాల 17 రోజులపాటు కొనసాగి 2014 ఫిబ్రవరి 23న ముగిశాయి.