నిజామాబాద్, ఏప్రిల్ 23, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రంలో కక్షసాధింపు రాజకీయాలకు తెరలేపిన రేవంత్ రెడ్డికి హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పును వెలువరించింది. రెండున్నరేళ్ల పరిపాలనలో అడుగడుగునా కేసీఆర్ పేరు, ప్రతిష్టలను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు అధికారిక, రాజకీయ కార్యక్రమాల్లో కేసీఆర్ పేరు ఉటంకించని కార్యక్రమం లేదు.
ఆరు గ్యారంటీల్లో 420 హామీలు అమలుపై శ్రద్ధ చూపాల్సిన అధికార పార్టీ నేతలంతా బీఆర్ఎస్ పార్టీపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్న ఆంధ్రా మీడియాతో చేతులు కలిపి ఇష్టారీతిన దుమ్మెత్తి పోయడానికే రేవంత్ రెడ్డి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. హామీల అమలుకై పెట్టిన రివ్యూలు, సమావేశాల కంటే కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని దెబ్బ తీసేందుకు చేసిన ఎత్తుగడలే ఎక్కువగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. హస్తం పార్టీ పరిపాలను జనాలంతా ఛీ కొడుతున్న దరిమిలా ప్రజా వ్యతిరేకతను తప్పించుకునేందుకు రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
తెలంగాణకు వరప్రదాయనిగా తీర్చిదిద్దిన కాళేశ్వరం బహుళార్ధసాధక ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ఆది నుంచి విషం చిమ్ముతున్నాడు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే లేని అవినీతిని అంటగట్టి విచారణ కమిషన్‌ను నియమించారు. ఆ కమిషన్‌కు సారథ్యం హించిన జస్టిస్ ఘోష్ సైతం రేవంత్ రెడ్డి ఉద్దేశాలకు అనుగుణంగానే లీకులు ఇచ్చి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెందించేలా వ్యవహరించి న్యాయస్థానం ముందు తలవంచుకోవాల్సి వచ్చింది.
ఘోష్ కమిషన్ పనితీరుపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా కొత్త చర్చకు దారి తీస్తోంది. హైకోర్టు తీర్పులో ప్రధానంగా కమిషన్ విచారణ విధానం, పారదర్శకత వంటి అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీని వల్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ప్రశ్నలు తలెత్తుతున్నా యి. ప్రభుత్వం ఉద్దేశం నిజంగా అవినీతి వెలికితీయడమా? లేక రాజకీయంగా ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడమా? అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
కేవలం బట్ట కాల్చి మీదేసి బురద రాజకీయానికి రేవంత్ రెడ్డి పాల్పడటమే ఇందులో కనిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయంటూ ఊహాజనిత అంశాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. సుదీర్ఘ విచారణ తర్వాత హైకోర్టు బుధవారం కీలక తీర్పు వచ్చింది. ఈ వ్యవహారంలో భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు ఊరట దక్కింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని హైకోర్టు పేర్కొంది. నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది.
బ్యారేజీల్లో అవకతవకలపై విచారణ నిమిత్తం జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్‌ను నియమిస్తూ 2024 మార్చి 14న జారీ చేసిన జీవో 6ను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీశ్ రావులతో పాటుగా ఐఏఎస్ అధికారులు స్మితా సభర్వాల్, ఎస్.కె.జోషిలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం విచారించింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై నోటికొచ్చినట్లుగా మాట్లాడి, ఇష్టారీతిన దుష్ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి తిరిగి అదే ప్రాజెక్టును రిపేర్ చేయిస్తానంటూ చెప్పుకుంటున్నాడు. గతంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానంటూ ప్రగల్భాలు పలికి ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో రూపుదిద్దుకున్న ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారపడాల్సి వస్తోంది. ఆంధ్రా శక్తులతో, బీజేపీ పార్టీతో చేతులు కలిపి కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజల్లో చెడును ప్రచారం చేశారు. కుట్రలు, కుతంత్రాలకు పాల్పడ్డారు.
కేసీఆర్ పేరును చెడగొట్టాలని కంకణం కట్టుకుని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుటిల పని చేశాయి. రాజకీయంగా బీఆర్ఎస్ను ఎదుర్కునే దమ్మూ ధైర్యం లేక అడ్డదారిలో మసి పూసి మారెడు కాయ చేశారు. ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాజకీయంగా లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచన చేసింది. కానీ ఘోష్ కమిషన్ విచారణ తీరునే హైకోర్టు తప్పు పట్టడంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు మింగుడు పడటం లేదు. ఈ పరిణామాలపై బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులంతా స్పందిస్తున్నారు.
ధర్మం గెలిచిందని… చెబుతున్నారు. తెలంగాణ ప్రజలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపి అసత్యాలు వెళ్లగక్కిన వారికి హైకోర్టు తీర్పుతో సమాధానం లభించిందని గులాబీ శ్రేణులు భావిస్తున్నారు. నిజం నిప్పులాంటిదని… అబద్ధాలతో ఎక్కువ కాలం మనుగడ సాధించలేరని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరిస్తున్నారు.
మోర్తాడ్, ఏప్రిల్ 22: కమిషన్ల పేరిట రాజకీయ వేధింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిది. పీసీ ఘోష్ కమిషన్ విచారణలో ప్రాథమిక నిబంధనలు పాటించలేదని కోర్టు స్పష్టం చేయడం ద్వారా ఆ నివేదికకు చట్టపరమైన ప్రాముఖ్యత లేదని తేలిపోయింది. ముఖ్యంగా సెక్షన్ 8 కింద సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించడం అత్యంత కీలకం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావుపై రాజకీయంగా ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కమిషన్లను అడ్డం పెట్టుకుని వేధింపులకు పాల్పడింది. కానీ న్యాయస్థానాలపై నమ్మకంతో వారు చేసిన పోరాటంలో చివరకు నిజమే గెలిచింది.
తెలంగాణ జీవధారగా భావించే కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఎంతో పేరుగడించిన తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్, బీజేపీ కక్షపూరితంగా వ్యవహరించాయి. ప్రాజెక్ట్‌కు సకాలంలో మరమ్మతులు చేపట్టకుండా దాదాపు రెండున్నరేండ్ల ఆలస్యం చేశారు. చివరకు కాళేశ్వరమే దిక్కని గత్యంతరం లేక ఇప్పుడు పనులు చేపడుతున్నారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌పై చేసిన ఆరోపణలు నిరాధారమని కోర్టు తీర్పుతో స్పష్టమైంది. కాంగ్రెస్, బీజేపీలకు ఈ తీర్పుతోనైనా కనువిప్పు కలగాలి.
– ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీమంత్రి, బాల్కొండ
ఖలీల్‌వాడి, ఏప్రిల్ 22: ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు స్టే విధించడం హర్షణీయం. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్ష గట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి హైకోర్టు తీర్పుతో చెంపదెబ్బ కొట్టినట్లయింది. భారత రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా గౌరవ న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని ఈ తీర్పుతో మరోసారి రుజువైంది. అది పీసీ ఘోష్ కమిషన్ కాదని, ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన పీసీసీ నివేదిక మాత్రమేనని తాము మొదటి నుంచి చెబుతున్న మాట ఈ రోజు అక్షరాల నిజమైంది.
ఘోష్ కమిషన్ విచారణలో సహజ న్యాయ సూత్రాలను పూర్తిగా విస్మరించటమే కాకుండా, నిబంధనలను తుంగలో తొక్కారని కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారు. ఇప్పుడు హైకోర్టు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రాజకీయ కక్షసాధింపు కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న రేవంత్ సర్కార్ తీరును ఈ తీర్పు ఎండట్టింది. తెలంగాణకు కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును గత రెండున్నరేండ్లుగా పడావు పెట్టిన రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా ముక్కు నేలకు రాసి రాష్ట్రంలోని అన్నదాతలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ఇకనైనా రాజకీయ కుట్రలు పక్కన పెట్టి రైతన్నల క్షేమం కోసం పని చేయాలి.
– జీవన్‌రెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు
ఖలీల్‌వాడి, ఏప్రిల్ 22: పాలన చేతగాక ప్రజల దృష్టి మళ్లించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపిత అభియోగాలని హైకోర్టు తీర్పుతో రుజువైంది. కేసీఆర్‌ను వేధించేందుకు కమిషన్ పేరుతో వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ ఎత్తుగడ హైకోర్టు ఎదుట తుస్సుమన్నది. రాజకీయ కక్షతో వ్యవహరించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయాలనే ప్రయత్నాల మధ్య వచ్చిన ఈ తీర్పు కేసీఆర్, హరీశ్‌రావులపై చేసిన ఆరోపణలు తప్పు అని తేలిపోయింది.
– బాజిరెడ్డి గోవర్ధన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే