నిజామాబాద్, నవంబర్ 26, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ యూనివర్సిటీలో వివాదాస్పద 2012 నోటిఫికేషన్ల రద్దును హైకోర్టు తాత్కాలికంగా నిలిపి వేసింది. ఈ మేరకు ద్విసభ్య ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 31న ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును నిలుపుదల చేయాలని కోరుతూ ఉద్యోగాలు రద్దు కాబడిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పలువురు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషనర్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ.కె.సింగ్, జస్టిస్ మొహీయుద్దీన్లతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారణ చేసింది. ఇరుపక్షాల వాదనలను విన్న తర్వాత జనవరి 8కి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
కౌంటర్ దాఖలు చేయాలని న్యాయవాది సుధీర్‌కు ద్విసభ్య ధర్మాసనం సూచించింది. హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం వెలువరించిన తీర్పులోని అంశాలపై వాదనలు జరిగాయి. ఐప్లెడ్ ఎకనామిక్స్, ఫార్మస్టిటికల్ కెమిస్ట్రీ కోర్సుల విషయంలో వివాదం, ఉద్యోగాల నియామకాల్లో రోస్టర్ పాయింట్ల ఉల్లంఘనపై మరోసారి చర్చ జరిగింది. ప్రస్తుతానికి రద్దు కాబడిన పోస్టులపై స్టే విధించడంతో 45 మందికి ఊరట దక్కినట్లు అయ్యింది. వారం క్రితమే రద్దు కాబడిన ఆచార్యులంతా కలిసి హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా తుది తీర్పునకు లోబడి ఉద్యోగాలు చేస్తామంటూ టీయూ 2012 నాటి ప్రొఫెసర్లు గతంలో బాండ్ పేపర్ రాసిచ్చిన అంశం కూడా హైకోర్టులో చర్చకు వచ్చినట్లుగా సమాచారం.
ప్రస్తుతం తెలంగాణ యూనివర్సిటీలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. అక్టోబర్ 31న హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు మేరకు నవంబర్ 25వ తేదీ వరకు 45 మంది ప్రొఫెసర్లు సాంకేతికంగా ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో కొంత మంది ఉద్యోగులు హాజరైనట్లు తెలిసింది. వీరందరికీ నవంబర్ నెలలో జీతాలు వేస్తారా? వేయరా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. వీరికి జీతాలు వేస్తే హైకోర్టు తీర్పును ఉల్లంఘించినట్లుగా మారుతుంది.
ఒకవేళా జీతాలు జమ చేయకపోతే జస్టీస్ నగేశ్ భీమపాక ఇచ్చిన తీర్పును అంగీకరించినట్లు అవుతుంది. అలాంటప్పుడు నోటిఫికేషన్లు రద్దు చేయాల్సి ఉంటుంది. కానీ ఇంతవరకైతే నోటిఫికేషన్ల రద్దు ముచ్చటే టీయూలో వెలుగు చూడలేదు. న్యాయపరమైన చిక్కులతో కూడిన ఈ అంశాల్లో టీయూ వీసీ, రిజిస్ట్రార్లు న్యాయ వ్యవస్థతోనే ఆటలాడారు. దీంతో వీరు తీసుకునే చర్యలపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. 2012 నోటిఫికేషన్ల రద్దుపై స్టే విధించడంతో టీయూ పాలకులు తక్షణం ఈ నిర్ణయాన్ని అమలు చేస్తారా? హైకోర్టు రిజిస్ట్రార్ నుంచి వచ్చే తీర్పు కాపీల కోసం ఎదురు చూస్తారా? అన్నది తేలాల్సి ఉన్నది.
హైకోర్టు తీర్పు తమకు రాలేదంటూ 27 రోజులుగా టీయూ వీసీ, రిజిస్ట్రార్ బుకాయిస్తున్నారు. కనీసం ఫోన్లు ఎత్తడానికి సాహసించడం లేదు. హైకోర్టు తీర్పు వచ్చిందా? రాలేదా? అని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తే నోరు విప్పలేదు. వీసీ, రిజిస్ట్రార్ అనుమానాస్పద వైఖరిని పసిగట్టి పలువురు విద్యార్థి సంఘాల నేతలు జోక్యం చేసుకుని హైకోర్టు తీర్పు కాపీలను అందించారు. వీసీ, రిజిస్ట్రార్లకు సాంకేతికంగా హైకోర్టు తీర్పు కాపీలు వివిధ రూపాల్లో చేరాయి. 2012 నోటిఫికేషన్ల వ్యవహారంలో న్యాయ పోరాటం చేస్తోన్న వెంకట్ నాయక్ స్వయంగా తన న్యాయవాది ద్వారా అటెస్ట్ చేసిన తీర్పు కాపీలను రిజిస్ట్రార్‌కు అందించాడు. మరికొంత మంది కూడా హైకోర్టు తీర్పు కాపీలను టీయూకు చేర్చారు.
మరోవైపు 10 రోజుల క్రితమే హైకోర్టు నుంచి నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి టీయూ మెయిన్ క్యాంపస్‌కు చేరాయి. ఈ విషయాన్ని గోప్యంగా పెట్టారు. అబద్ధాలు ఆడుతూ నిజాన్ని దాచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు టీయూ వీసీ, రిజిస్ట్రార్లు తీర్పు కాపీలు రాలేవని చెబుతుండగా… మరోవైపు 2012 నోటిఫికేషన్ల రద్దుతో ఉద్యోగాలు కోల్పోయిన వారంతా ఉన్నత న్యాయస్థానానికి వారం క్రితమే అప్పీల్‌కు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ యూనివర్సిటీని కొంత మంది అక్రమార్కులు తమ స్వార్థం కోసం నిత్యం అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా మారుస్తున్నారు. ప్రస్తుతం ఓ వివాదాస్పద వ్యక్తి మూలంగా టీయూ పరువు రోజురోజుకు దిగజారుతోందని టీయూ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.