బాన్సువాడ, జూలై 31: ప్రజలకు ఇసుక అందుబాటులో లేకపోవడంతో నిర్మాణ రంగం దెబ్బతింటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇసుక లభ్యత ఉన్న చోట రీచ్‌లను ఏర్పా టు చేసి రవాణాకు అనుమతులు ఇచ్చింది. పేదల ఇండ్ల పనులు మధ్యలో ఆగిపోకుండా ఉచితంగా ఇసుక అందిస్తామనే ఉద్దేశంతో కొన్ని క్వారీలకు అనుమతి ఇవ్వగా.. ఇదే ఆసరాగా చేసుకొని కొంతమంది అక్రమార్కులు ఇసుక దోపిడీకి తెరలేపారు. డివిజన్లోని డోంగ్లి, బీర్కూర్, బిచ్కుంద తదితర మండలాల్లోని సమీప వాగులు, మంజీరా పరీవాహక ప్రాంతాలను ఉదయం నుంచి రాత్రి వరకు జల్లెడ పడుతున్నారు. ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలించి శివారు ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. రాత్రివేళల్లో కర్ణాటక రాష్ట్రంలోని బీదర్, బాల్కి, మహారాష్ట్ర, హైదరాబాద్ లాంటి పట్టణాలకు టిప్పర్లలో తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇంత జరిగినా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తుందని ప్రజలు విమర్శిస్తున్నారు.
మంజీర పరీవాహక ప్రాంతాల నుంచి పగటిపూట దర్జాగా ట్రాక్టర్లలో, రాత్రి పెద్దపెద్ద లారీలు, టిప్పర్లలో ఇసుకను దూర ప్రాంతాలకు పంపుతూ జీరో దందా కొనసాగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. బిచ్కుం ద మండలంలోని షెట్లూర్, ఖుర్లా గ్రామాలకు చెందిన బడాబాబులు ట్రాక్టర్, లారీలను లెక్కించి అధికారులకు ముడుపులు ఇచ్చుకుంటున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్ ట్రిప్పుకు వెయ్యి, లారీకి రూ.5వేల చొప్పున మధ్యవర్తులు అందిస్తున్నట్లు గ్రామాల్లో బాహటంగానే మాట్లాడుకుంటున్నారు.
జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుం ద మండలం హస్గుల్, పుల్కల్, ఖండ్గావ్, గుండెనెమ్లి గ్రామాల్లో కొంతకాలం క్రితం టీఎస్ఎండీసీ ద్వారా ఇసుక వే బిల్లులను జారీ చేసింది. ఆయా క్వారీల్లో ఇసుక మేటలు తొలగించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన వ్యాపారులు అక్రమంగా ఇసుకను తరలించడంతో ఫిర్యాదులు రాగా.. క్వారీల నుంచి ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. మరోవైపు బిచ్కుంద,బీర్కూర్, డోంగ్లి మండలాల్లోని పలు చెరువుల నుంచి ఇసుకను కొంతమంది ట్రాక్టర్లలో తరలించి దర్జాగా విక్రయిస్తున్నారు. హస్గుల్ సమీపంలోని మంజీర నుంచి తరలిస్తున్న ఇసుకను పొద్దంతా మెయిన్‌రోడ్డుపై డంపింగ్ చేసి రాత్రివేళల్లో టిప్పర్, లారీల్లో రవాణా చేస్తున్నారు. 5వ నంబర్ క్వారీ నుంచి తరలించిన ఇసుకను బిచ్కుంద మండల కేంద్రంలోని జ్యోతిబా పూలే స్కూల్ వెనుకభాగం గుట్ట ప్రాంతంలో డంప్ చేస్తూ అర్ధరాత్రి వేళల్లో కర్ణాటక, మహారాష్ట్ర , హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు టిప్పర్లలో సాగనంపుతున్నారు. ఒక్కో టిప్పర్ ఇసుకకు రూ.50 వేల చొప్పున వసూలు చేస్తూ లక్షలు ఆర్జిస్తున్నట్లు తెలుస్తున్నది.
డివిజన్లోని ఏ మండలం, ఏగ్రామంలోనైనా మంజీర పరీవాహక ప్రాంతం, లేదా వాగుల నుంచి ఇసుకను తోడి అక్రమంగా రవాణా చేస్తే చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా ఇసుకను అక్రమంగా ట్రాక్టర్లలో, లారీల్లో రవాణా చేసినా, అర్ధరాత్రి వేళల్లో ఇసుకను నింపినట్లు తెలిస్తే.. సమాచారం ఇవ్వాలి. వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. అక్రమార్కులు గతంలో డంపింగ్ చేసిన ఇసుకను సీజ్ చేశాం.
– రాథోడ్ రమేశ్, ఆర్డీవో, బాన్సువాడ
పొతంగల్, జూలై 31: ఇసుక రవాణాను అరికట్టాలని తహసీల్ కార్యాలయంలో పొతంగల్ గ్రామస్తులు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంజీర నుంచి రాత్రింబవళ్లు ఇసుక తోడేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో గంట్ల విఠల్, గంధం పవన్,బండారి గంగారాం, సుధం పరశురాం, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పొతంగల్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను ఆర్ఐ సాయిలు సిబ్బందితో కలిసి బుధవారం సీజ్‌చేశారు.