కోటగిరి/ రుద్రూర్/ నస్రుల్లాబాద్/కంఠేశ్వర్/బిచ్కుంద, ఏప్రిల్ 10: ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో గురువారం అకాలవర్షం కురిసింది. కోటగిరి, రుద్రూర్, నస్రుల్లాబాద్, బీర్కూర్ తదితర మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురవడంతో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. రోడ్లపై కాంటా చేసిన బస్తాలు కూడా తడిసిపోయాయి. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు.
నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని మార్కెట్‌యార్డులో పసుపు బస్తాల్లోకి వర్షపు నీరు చేరింది. బిచ్కుంద మండలంలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. సుమారు గంట పాటు కురిసిన వర్షానికి వరి, జొన్న, మక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంట నేల పాలయ్యిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.కందర్పల్లి-బిచ్కుంద ప్రధాన రహదారిపై చెట్లు పడి పోవడంతో జీపీ కార్యదర్శి ట్రాక్టర్ సహయంతో తొలగింపజేశారు.