నిజామాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ఉమ్మడి జిల్లా ను భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదనీటితో ఊర్లు, పైర్లు ఏకమయ్యాయి. పది రోజులుగా కురుస్తున్న వానలతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు వణికిపోతున్నా యి. బుధవారం సాయంత్రం నుం చి మొదలైన కుంభవృష్టి గురువా రం రోజంతా కొనసాగింది. చుట్టుముట్టిన వరదతో పల్లెలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో రహదారులు తెగిపోయాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజాప్రతినిధులు,అధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నా రు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి రంగంలోకి దిగి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అలాగే,ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, హన్మంత్ షిండే, జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
తెగిన రోడ్లు.. స్తంభించిన రాకపోకలు
ఆర్మూర్ పట్టణ శివారులోని ఎన్‌హెచ్ 44 వద్ద రోడ్డు, నందిపేట-ఆర్మూర్ రోడ్డుపై వరద పోటెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్-కరీంనగర్ మార్గంలోని జాతీ య రహదారిపై పలుచోట్ల వరదనీరు పారడంతో రాకపోకలకు ఇక్కట్లు తప్పలేదు. ఇక నిజామాబాద్ – బోధన్ మార్గంలో జాన్కంపేట చెరువు ప్రమాదకర స్థాయికి చేరింది. రోడ్డుకు సమాంతరంగా వరద నీరు వచ్చి చేరడంతో అటువైపు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. మాణిక్‌బండార్ వద్ద జాతీయ రహదారిని వరద ముంచెత్తడంతో రాకపోకలకు బ్రేక్ ప డింది. తీగల వాగు ఉధృతితో ఏర్గట్ల నుంచి జగిత్యాలకు వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్ రోడ్డును వరద కమ్మేసింది. కమ్మర్పల్లి-ఉప్లూర్ మధ్య రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.
బాల్కొండ మండల జలాల్పూర్ లో రోడ్డు తెగిపోయింది. తాత్కాలిక రోడ్డు వేయగా అది కూడా కొట్టుకుపోయింది. ధర్పల్లిలో వాడి వాగు ఉ ప్పొంగడంతో బ్రిడ్జి కనిపించకుండా పోయింది. అటువైపు జనం రాకను అధికారులు తాత్కాలికంగా నిషేధించారు. ధర్పల్లి-ఆర్మూర్, సుద్దులం-యానంపల్లి తండా వెళ్లే రోడ్డు వరదతో నిండిపోయింది. ఇందల్వాయి – ధర్పల్లి మార్గంలో లింగాపూర్ తండా బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహించింది. మాచారెడ్డి-అక్కాపూర్, బీబీపేట-మందాపూర్, రామారెడ్డి మండలంలో కన్నాపూర్-కామారెడ్డికి, బ్రాహ్మణపల్లికి వచ్చే రెండు మార్గాలు వరదతో నిండుగా ప్రవహించడంతో రాకపోకలు నిలిపేశారు. పెద్దకొడప్గల్లో జాతీయ రహదారికి ఆనుకుని సర్వీస్ రోడ్డును వరద చుట్టుముట్టింది.ఎల్లారెడ్డి మండలంలో తిమ్మారెడ్డి వం తెన పైనుంచి వరద ప్రవహించడంతో ప్రజలను అనుమతించలేదు.
హై అలర్ట్‌లో ఉభయ జిల్లాలు..
మొన్నటి వరకు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలు రెడ్ అలర్ట్‌లో ఉండగా, తాజాగా కామారెడ్డి జిల్లాలోని అనేక ప్రాంతాలను రెడ్ జోన్‌గా వాతావరణ శాఖ ప్రకటించింది. రెవెన్యూ, పోలీస్ శాఖలు రంగంలోకి సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదకర పరిస్థితులున్న చోట్ల జనాన్ని బయ టికి రానివ్వకుండా నియంత్రించారు.లోతట్టు ప్రాంతా ల్లో భయానక పరిస్థితి నెలకొన్నది. రోజుల తరబడి కురుస్తున్న వర్షాలతో రైతులు పొలం పనులు, ప్రజలు ఇతర పనులు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. రోడ్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో ప్రజలు ఇంటికే పరిమితం కావాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చే సింది. గ్రామీణ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ము న్సిపల్ రహదారులు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల రోడ్లు నామ రూపాల్లేకుండా పోయాయి. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, పురపాలక శాఖల అధికారులు ఎప్పటికప్పుడు నష్ట అంచనాలను సిద్ధం చేస్తున్నారు.
దంచికొట్టిన వాన
నిజామాబాద్ జిల్లాలో ఏర్గట్లలో 159 మి.మీ, కమ్మర్‌పల్లిలో 143, మోర్తాడ్‌లో 133, భీమ్‌గల్‌లో 124, మెండోరాలో 123, బాల్కొండలో 119, వేల్పూర్‌లో 105, ముప్కాల్‌లో 103 మి.మీ. వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ సౌత్ మండలంలో ఇంకా లోటు వర్షపాతం కొనసాగుతుండడం విశేషం. కామారెడ్డి జిల్లాలో గాంధారిలో 77 మి.మీటర్లు, నస్రుల్లాబాద్‌లో 73, పాల్వంచ మండలం ఇసాయిపేటలో 69, నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్‌దేవ్‌పల్లిలో 67, తాడ్వాయిలో61, కామారెడ్డిలో 60 మి.మీ వర్షం కురిసింది.