ఎల్లారెడ్డి/ లింగంపేట/ నవీపేట/ నందిపేట్, సెప్టెంబర్ 24: ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం రాత్రి, మంగళవారం భారీ వర్షం కురిసింది. నవీపేట మండలంలోని యంచ గ్రామంలో సోమవారం రాత్రి పిడుగు పడిన శబ్దానికి గ్రామానికి చెందిన లక్ష్మీబాయి(61) మృతిచెందిందని స్థానికులు తెలిపారు. గ్రామంలో నాలుగు టీవీలు, ఏడు ఫ్యాన్లు షార్ట్ సర్క్యూట్‌తో కాలిపోయాయన్నారు. డొంకేశ్వర్ మండలం గంగసముందర్ గ్రామంలో సోమవారం రాత్రి పిడుగుపడి అచ్చగారి చిన్న భోజారెడ్డి ఇల్లు ధ్వంసమైంది. ఇంట్లోని ఎలక్ట్రికల్ వస్తువులు కాలిపోయాయి. స్లాబ్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోగా.. అధికారులు మంగళవారం పునరుద్ధరించారు.
ఎల్లారెడ్డి పట్టణంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. బస్టాండ్ సమీపంలో ఉన్న బీసీ కాలనీలోని పలు ఇండ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీరు వెళ్లడానికి దారి లేకపోవడంతో ఇండ్లలోకి చేరిందని, ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులకు తెలిపినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. లింగంపేట మండలంలోని భవానీపేట గ్రామంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురియడంతో వరి నేలకొరిగింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురియడంతో దిగుబడి తగ్గుతుందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పంటను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
బోధన్, సెప్టెంబర్ 24: బోధన్ డివిజన్లోని మండలాల వారీగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు వర్షం కురిసింది. రెంజల్ మండలంలో 30.6 మిల్లీ మీటర్లు, కోటగిరిలో 11.8, బోధన్‌లో 17.8, వర్నిలో 24.4, మోస్రాలో 8.6, ఎడపల్లిలో 27, రుద్రూర్లో 15.4, చందూర్ మండలంలో 11.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని బోధన్ గణాంక అధికారి లక్ష్మారెడ్డి తెలిపారు.