నిజామాబాద్, సెప్టెంబర్ 1 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ నిజామాబాద్ జిల్లా యంత్రాంగం: జిల్లావ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉన్నది. దీంతో చెరువులు, కుంటల్లోకి పూర్తిస్థాయిలో నీరు చేరింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జమయమయ్యాయి. పలు ఇండ్లు పాక్షికంగా కూలిపోయాయి. పంట పొలాల్లోకి నీరు వచ్చి చేరింది. వాగులు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి జిల్లాలో ఐదు చోట్ల కుండపోత వాన కురియగా 25 మండలాల్లో అతి భారీ వర్షపాతం రికార్డు కాగా మిగిలిన చోట్ల భారీ నుంచి సాధారణ వర్షపాతమే నమోదైంది.
నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా సిరికొండ మండలం తూంపల్లిలో 11.6సెం.మీ వర్షాపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలో గాంధారి మండలం సర్వాపూర్‌లో 14.4సెం.మీ, గాంధారిలో 12.9సెం.మీ, కామారెడ్డి కలెక్టరేట్లో 12.8సెం.మీ, లింగంపేటలో 11.7సెం.మీ చొప్పున రికార్డు స్థాయిలో అతి భారీ వానలు కురిశాయి. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల మేరకు అనేక చోట్ల అతి భారీ వానలే కురిశాయి. పలు చోట్ల రెడ్ అలర్ట్, కొన్ని చోట్ల ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది.
నిజామాబాద్ నగరంలోనూ పలు కాలనీల్లో జలమయమయ్యాయి. దుబ్బా ప్రాంతంలో రాకపోకలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొత్త కలెక్టరేట్ సమీపంలో వరద నీరు భారీగా మురికి కాలువ గుండా ఉధృతంగా ప్రవహించింది. నగరం మధ్యలో నుంచి వెళ్లే ఫులాంగ్ వాగు భారీ ప్రవాహాన్ని అందుకుంది. గూపన్పల్లి గ్రామానికి వెళ్లే దారి మీదుగా ఫులాంగ్ వాగు ప్రమాదకర స్థాయిలో వరద పోటెత్తింది. రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అప్రమత్తతతో వ్యవహరించారు.
నీళ్లు నిలువకుండా ఎప్పటికప్పుడు జాగ్రత వహించారు. మొన్న ఆర్టీసీ బస్సు నీళ్లలో చిక్కుకున్న ఘటన నేపథ్యంలో చర్యలు తీసుకోవడం మూలంగా జనాలకు ఉపశమనం దక్కింది. చంద్రశేఖర్ కాలనీ, దుబ్బా, సుభాష్ నగర్, గాయత్రి నగర్, ఆర్యనగర్, న్యాల్కల్ రోడ్డులోని పలు కాలనీల్లో జనాలకు వరద నీరు ఇక్కట్లు తీసుకు వచ్చింది. వర్ని రోడ్డులోని ఖిల్లా, సాయినగర్ వంటి ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి తలపించింది. ఏకధాటి వానతో నిజామాబాద్ నగరం చిగురుటాకులా వణికింది.