కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలు ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. సింగూరు జలాలను మరోమారు భారీగా వదలడంతో మంజీర ఉగ్రరూపం దాల్చింది. దీంతో నాగిరెడ్డిపేట మండలంలోని వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వందల ట్రాన్స్ఫార్మర్లు పూర్తిగా నీట మునిగి ట్రాన్స్‌కోకు మరో మారు కోలుకోలేని దెబ్బతీసింది. పంటలు, బోరుమోటర్లు, స్టార్టర్లు పూర్తిగా నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు బోధన్ మండలంలోని హంగర్గ గ్రామం వద్ద మంజీరా ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో గ్రామం మరోసారి జలదిగ్బంధంలో చిక్కుకున్నది. గ్రామానికి ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ నుంచి వరద వచ్చి చేరగా, పంట పొలాలు నీట మునిగాయి. గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. నవీపేట మండలంలోని యంచ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో నదీ తీర ప్రాంత గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. యంచ-అల్జాపూర్కు రాక పోకలు నిలిచిపోయాయ.
-నాగిరెడ్డిపేట/బోధన్/ బోధన రూరల్/ నవీపేట, సెప్టెంబర్ 28
నాగిరెడ్డిపేట, సెప్టెంబర్ 28: సింగూరు జలాలను మరో మారు భారీగా వదలడంతో..మండలంలోని మంజీర సమీప శివారులోని 12 గ్రామాల్లో వేల ఎకరాల్లో పంటలు నెల రోజులుగా మునుగుతున్నాయి. ఆదివారం సింగూర్ ప్రాజెక్టు నుంచి లక్షా 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం, మెదక్ హల్దివాగు, పోచారం ప్రాజెక్టు వరద భారీ స్థాయిలో వస్తుండడంతో మంజీర ఉగ్రరూపం దాల్చింది. నదికి మూడు కిలోమీటర్ల దూరం వరకు వరద పోటెత్తుతున్నది. గోపాల్పేట, బంజారా గ్రామాల మధ్య నూతన జాతీయ రహదారిపైకి వరద రావడంతో రోడ్డు ఇరువైపులా కోతకు గురైంది. అప్రమత్తమైన రెవెన్యూ అధికారులు రహదారిపైకి వరద రాకుండా మట్టితో అడ్డుకట్టవేయించారు.
మండలంలోని గోలిలింగాల, చీనూర్, మేజర్‌వాడి, వెంకంపల్లి, మాటూర్, ఆత్మకూర్, ఎర్రారం గ్రామాల సమీపంలోకి వరద చేరడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. సింగూర్ ప్రాజెక్టు నుంచి గడిచిన 40 ఏండ్లలో ఇంతటి భారీ స్థాయిలో నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారి అని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఆర్డీవో పార్థ సింహారెడ్డి, వెంకంపల్లి, నాగిరెడ్డిపేట శివారులో నీట మునిగిన పంటలు, వెంకంపల్లి బ్రిడ్జి వద్ద మంజీర ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో 5వేలకు పైగా ఎకరాల పంటలు పూర్తిగా నీట మునిగినట్లు చెప్పారు. వరదనీరు తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.