బోధన్ రూరల్/ధర్పల్లి, జూన్ 26: ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా వర్షం కురుస్తున్నది. బుధవారం రాత్రి, గురువారం కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పది రోజులుగా ముఖం చాటేసిన వాన.. ఎట్టకేలకు పలుకరించడంతో రైతన్నలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. నారు మడులు సిద్ధంగా ఉన్న అన్నదాతలు నాటు వేసే పనులు ప్రారంభించారు.
పొలాల్లో నీరు నిలువడంతో ట్రాక్టర్‌తో దమ్ము చేయడం, ఒడ్లు చెక్కడం తదితర పనుల్లో బిజీగా మారారు. ఇప్పటికే నాటిన పత్తి, మక్కజొన్న, సోయా తదితర విత్తనాలు మొలకెత్తుతాయని రైతులు అంటున్నారు. మరోవైపు గ్రామాలు, పట్టణాల్లో రోడ్లపై నీరు నిలిచి, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.