నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 21 : వర్షాకాలం ప్రారంభమై సుమారు 40 రోజులు కావస్తున్నా వర్షాలు లేక వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్న అన్నదాతల్లో రెండు రోజులుగా ముసురు పట్టి కురుస్తున్న వర్షం సంతోషం నింపింది. జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షం కురుస్తున్నది. రెండు, మూడురోజులుగా ముసురు వేయడంతో చెరువుల్లోకి వర్షపునీరు వచ్చి చేరుతున్నది. వాగులు నిండుగా ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల పురాతన ఇండ్లు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోటగిరి మండలంలో నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలకు జీవం పోసినట్లయ్యిందని రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. డిచ్‌పల్లిలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఖిల్లా డిచ్పల్లి, బర్ధిపూర్, సుద్దులం, యానంపల్లి చెరువుల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది.
ధర్పల్లి మండలకేంద్రంలోని పెద్దచెరువులోకి మాటు కాలువ ద్వారా భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతున్నది. వీడీసీ ఆధ్వర్యంలో మాటు కాలువలో చెత్తా చెదారం తొలగించి, నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టారు. పొతంగల్ మండలంలోని కొల్లూరు-దోమలెడ్గి వాగు వద్ద బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయి. వాహనదారుల కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డుపై నుంచి వర్షపు నీరు భారీగా ప్రవహిస్తున్నది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇందల్వాయి మండలకేంద్రంతోపాటు పలు గ్రామాల్లోని చెరువుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతున్నది. మండలంలో ఇప్పటివరకు 67.4 మి.మీ. వర్షం కురిసిందని తహసీల్దార్ వెంకట్రావు తెలిపారు. రుద్రూర్ మండలంలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చిక్కడ్పల్లి చెరువు అలుగు పారింది. రుద్రూర్ నుంచి బొప్పాపూర్ వెళ్లే దారిలో వాగు బ్రిడ్జిని తాకి ప్రవహిస్తున్నది. జేఎన్సీ కాలనీలో మంకగారి పెద్దబాబు ఇల్లు పాక్షికంగా కూలింది. చందూర్ మండలకేంద్రంలో పలు కాలనీల్లో వర్షపు నీరు ఇండ్లలోకి చేరింది.
జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ స్తంభాలు, కరెంట్ తీగలతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 24 గంటల్లో 88.1 మీమీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కమ్మర్‌పల్లిలో అత్యధికంగా 25.8 మి.మీ., వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ధర్పల్లిలో 11.0 మి.మీ., ఆలూర్‌లో 7.0లో మి.మీ., వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఖలీల్‌వాడి, జూలై 21 : వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఆ శాఖ అధికారులు మరమ్మతులు చేపడుతున్నారు. అన్ని ఫీడర్లలో మరమ్మతులు చేపడుతుండడంతోపాటు విద్యుత్ వైర్లకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లోని చెరువులు, వాగులకు జలకళ సంతరించుకుంది. మోర్తాడ్‌లో శనివారం 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్ సత్యనారాయణ తెలిపారు. వర్షాలు ఎక్కువగా కురుస్తున్నందున పాత ఇండ్లలో ఉంటున్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు చెరువులు, వాగుల వద్దకు వెళ్లవద్దని మోర్తాడ్, కమ్మర్పల్లి తహసీల్దార్లు సత్యనారాయణ, ఆంజనేయులు సూచించారు.
ఆర్మూర్ పట్టణ శివారులోని ఆలూర్ బైపాస్ రోడ్డు వద్ద పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. నీటిలో వస్తున్న చేపలను పట్టుకునేందుకు యువకులు తరలివచ్చారు. రెంజల్ మండలంలో 102.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. నవీపేట మండలం జన్నేపల్లి మాటు కాలువ ఉధృతంగా ప్రవహిస్తున్నది. జన్నేపల్లి తదితర గ్రామాల్లో పంట పొలాల్లో నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. ఫత్తేనగర్ గ్రామంలో ఇల్లు కూలిందని రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. నవీపేట మండలంలో ఆదివారం 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఇరిగేషన్ ఏఈ శ్రీధర్ తెలిపారు.
బోధన్ మండలంలోనూ రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. బోధన్ పట్టణ శివారులోని పలు వాగుల్లో నీరు పారుతోంది. బోధన్ ప్రజలకు తాగు, సాగునీరందించే బెల్లాల్ చెరువు, పాండు చెరువు పూర్థిస్థాయిలో నీటితో నిండి అలుగుపై నుంచి నీరు పారుతోంది. బోధన్ పట్టణ శివారులోని బోధన్- నిజామాబాద్‌లోని నర్సాపూర్ వాగులో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. భీమ్‌గల్ మండలంలో కప్పలవాగు చెక్‌డ్యాంపై నుంచి వర్షపు నీరు ప్రవహిస్తున్నది. చెక్‌డ్యాం నిండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తహసీల్ కార్యాలయానికి వెళ్లే రోడ్డు వర్షం కారణంగా కోతకు గురైంది.