రెండు పంటలకు ఢోకాలేదని సంబురపడుతున్నారు. ఎస్సారెస్పీలోకి భారీగా వరద రావడంతో కాలువల ద్వారా, గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేస్తుండడంతో పోచంపాడ్ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు ప్రారంభించారు.
-మోర్తాడ్/బాన్సువాడ(నిజాంసాగర్), ఆగస్టు 18
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఆగస్టు 18 : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో మూడు, నాలుగురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులకు వరద పోటెత్తగా.. చెరువులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు అలుగుపారడంతో కోటగిరి, పిట్లం, పెద్దకొడప్గల్, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్, రుద్రూర్, వర్ని తదితర మండలాల్లో పంటలు, బోరుమోటర్లు నీట మునిగాయి. కొన్ని మండలాల్లో వాగుల ఉధృతికి రోడ్లు ధ్వంసం కావడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శిథిలావస్థలో ఉన్న ఇండ్లు కూలిపోగా..స్థానిక జీపీ సిబ్బంది, అధికారులు నిరాశ్రయులను పునరావాస కేంద్రాలకు తరలించారు.
నాగిరెడ్డిపేట మండలంలోని మంజీరా పరీవాహక గ్రామాలైన గోలిలింగాల, చీనూర్, మేజర్‌వాడి, నాగిరెడ్డిపేట, గోపాల్పేట, లింగంపల్లి కలాన్, వెంకంపల్లి, తాండూర్, మాటూర్, ఆత్మకూర్ జలాల్పూర్ గ్రామ శివారులోని సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు పంటలు నీట మునిగాయి.
సుమారు రెండు వేల ఎకరాల వరకు పంటలు పూర్తిగా నీటిలో మునిగిపోయినట్లు తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, ఏవో సాయికిరణ్ తెలిపారు. మహ్మద్‌నగర్ మండలం నర్వ చెరువులోని అలుగుపై మట్టి పోయడంతో వెంకటాపూర్, వెల్లుట్ల గ్రామాలకు చెందిన రైతుల పంట పొలాలు వంద ఎకరాల వరకు నీట మునిగాయి. పెద్దకొడప్, పిట్లం మండలాల్లోని లింగంపల్లి, చిన్న తక్కడ్‌పల్లి, తుప్దాల్ గ్రామాల్లో వరి,చెరుకు, పత్తి, సోయాబీన్, మక్కజొన్న తదితర పంటల్లోకి వర్షపు నీరు చేరింది. రుద్రూర్, వర్ని మండలాల్లో వరి పొలాలు, బోరు మోటర్లు నీట మునిగాయి.