ధర్పల్లి, సెప్టెంబర్ 3 : ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలు మండలంలోని బీరప్ప తండాలో తీవ్ర నష్టం చేకూర్చాయి. అన్నిరకాలుగా ఆ గ్రామాన్ని ముంచేశాయి. వరద బీభత్సానికి గ్రామంలో కొత్తగా నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇండ్లకు భారీ వృక్షాల వేళ్లు తట్టుకుని పునాదులు సైతం కూలిపోయాయి. అందరికీ అన్నం పెట్టే వారే అన్నమో రామచంద్ర అని సాయమందించే వారి కోసం ఎదురు చూస్తున్నారంటే వారి పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.
వారం రోజుల క్రితం వరకు అందరిలాగే పంట వేసుకొని ఉన్నంతలో దర్జాగా బతికిన వారికి ఆ ఒక్కరోజే వారి జీవితాలను తారుమారు చేసింది. వరద సృష్టించిన గాయం నుంచి తేరుకోవాలంటే వారికి కొన్నేండ్లు పట్టనున్నది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నడిమి తండా అటవీ ప్రాంతంలోని ముత్యాల చెరువు తెగిపోయి వరద బీరప్ప తండా, నడిమితండా, వాడి గ్రామాలను ముంచెత్తిన విషయం తెలిసిందే.
వరద బీభత్సం సృష్టించి వారం రోజులు గడిచినా ఇంకా వారి పరిస్థితి దైన్యంగా ఉన్నది. సాయమందించే వారే కరువయ్యారు. అధికారులు, నాయకులు వాడి తండాను సందర్శించి అక్కడి నుంచి అటే వెళ్తున్నారని, కనీసం తమ తండాకు వచ్చి పట్టించుకునే వారే కరువయ్యారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. రెండు రోజుల క్రితం తహసీల్దార్‌కు విన్నవించినా ఫలితం లేకపోయింది.
సాగుకు పనికి రాకుండా మారిన పొలాలు
వరద ఉధృతికి వాగులు ఉప్పొంగి పంట పొలాలను ముంచెత్తింది. భారీ వృక్షాలు, పొదలు మొత్తం పంట పొలాల్లోకి కొట్టుకువచ్చాయి. పచ్చని పొలాలు సర్వనాశనమై ఇసుక మేటలు వేయడంతో సాగుకు పనికి రాకుండా పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బీరప్ప తండాలో జరిగిన నష్టంపై పూర్తిస్థాయిలో అంచనా వేసి ఆదుకోవాలని కోరుతున్నారు.
పదేండ్లు వెనక్కి పోయాం..
వరద చేకూర్చిన నష్టంతో మేము పదేండ్లు వెనక్కి వెళ్లిపోయాం. మాకున్న నాలుగున్నర ఎకరాల్లో పూర్తిగా చెట్లు, ఇసుక మేటలు వేసి సాగుకు పనికి రాకుండా పోయింది. ఇంతవరకు మమ్మల్ని పట్టించుకుని ధైర్యం చెప్పి అండగా నిలిచిన వారే కరువయ్యారు. ఇటీవల వరద బాధితుల పరామర్శకు వచ్చిన జిల్లా ఎంపీ సైతం ఇక్కడి వరకు రాలేదు. ఇలాంటి వరద బీభత్సాన్ని ఇంతవరకు సినిమాల్లోనే చూశాం. కానీ మేము ప్రత్యక్షంగా చూసి నరకాన్ని అనుభవించాం.
– దరావత్ రవీందర్,బీరప్ప తండా
నాలుగెకరాల పంట పూర్తిగా పాడైపోయింది
నాకున్న నాలుగు ఎకరాల్లో పంట పూర్తిగా ఇసుక మేటలు వేసింది. ఇప్పుడు చూస్తే పచ్చని పంట పోయి ఇసుకే మిగిలింది. మున్ముందు అందులో పంట పండించడం కష్టం. పెద్ద పెద్ద చెట్లు కొట్టుకొచ్చి పంటల్లోనే పేరుకుపోయాయి. కొందరు ఇసుక మేటలు లేని పంటను పశువులకు మేతగా వదిలేశారు. ఇంత జరిగినా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మమ్మల్ని ఆదుకోవాలి.
– దరావత్ పంతులు, బీరప్ప తండా