బీబీపేట్/మోర్తాడ్/ధర్పల్లి/ కామారెడ్డి రూరల్, ఏప్రిల్ 18: ఉమ్మడి జిల్లాలో శుక్రవారం అకాల వర్షంతోపాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో పలు గ్రామాల్లో చెట్లు నేలకొరిగాయి. కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలపై చెట్లు కూలడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. బీబీపేట మండలం శివారు రాంరెడ్డిపల్లి గ్రామంలో పంచాయతీ సిబ్బంది బక్క ప్రవీణ్ ఇంటి రేకులు గాలి కొట్టుకుపోయాయి. పెండ్లికోసం తీసువచ్చిన రూ.40 వేలు లెక్కపెడుతుండడంతో గాలికి డబ్బులు కూడా కొట్టుకుపోవడంతో కుటుంబీకులు బోరుమని విలపించారు.
తుజాల్పూర్, యాడారం, బీబీపేట, మాందాపూర్, జనగామ తదితర గ్రామాల్లో మామిడికాయలు రాలిపోగా, వరి పంట నేలకొరిగిందని ఆయా గ్రామాల రైతులు తెలిపారు. మోర్తాడ్ మండలం ఉప్లూర్ శివారులోని వడ్డెరకాలనీ ప్రాంతం, నాగాపూర్ శివారులోని వ్యవసాయక్షేత్రంలో విద్యుత్ స్తం భాలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరాఫరాలో అంతరాయం ఏర్పడింది. ధర్పల్లి మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో తూకం వేయడానికి ధాన్యాన్ని సిద్ధంగా ఉంచుకోగా..వర్షానికి తడవకుండా కాపాడుకోవడానికి నానా పాట్లు పడ్డారు.
కామారెడ్డి మండలం ఇస్రోజివాడి గ్రామంలో శుక్రవారం పిడిగుపాటుకు 40 గొర్రెలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన కడారి దేవయ్య రోజు మాదిరిగానే గొర్రెలను మేతకు తీసుకెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో మందపై పిడుగులు పడగా 40కి పైగా గొర్రెలు మృత్యువాత పడ్డాయి. రూ.5 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరాడు.