గాంధారి/ ధర్పల్లి(సిరికొండ) మే 23: ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుడిమెట్ గ్రామంలోని పంట పొలాల్లో ట్రాన్స్ఫార్మర్తోపాటు మూడు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. బుధవారం వీచిన గాలులకు మామిడికాయలు నేలరాలాయి. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం సీతాయిపేట్ గ్రామ పరిధిలోని గుడితండాలో గురువారం ఉదయం వీచిన ఈదురుగాలులకు ఓ ఇంటి పైకప్పు రేకులు ఎగిరివచ్చి అరకిలోమీటర్ దూరంలో పడ్డాయి. సిరికొండలో బుధవారం సాయంత్రం గాలివానకు పోలీస్ స్టేషన్ ఆవరణలోని బీఎస్ఎన్ఎల్ పాత టవర్ విరిగిపడింది. మైలారంలో నాలుగు ట్రాన్స్ఫార్మర్లు, పలు స్తంభాలు నేలకొరగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.