Heart Attack | వినాయక నగర్, జూన్ 8 : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సౌత్ రూరల్ పరిధిలో గల మోపాల్ పోలీస్ స్టేషన్ విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఏ గంగాధర్ (హెచ్ సీ,1173) సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు 1998 బ్యాచ్ కు చెందిన గంగాధర్ గత ఏడాది క్రితం వరకు నిజామాబాద్ నార్త్ రూరల్ పరిధిలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించాడు. అనంతరం ఆయన హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పదోన్నతి పొందడంతో అక్కడి నుండి మోపాల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీపై వచ్చి అక్కడే విధులు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో భాగంగా సోమవారం ఆయన మోపాల్ మండల పరిధిలో జరిగిన కార్యక్రమంలో మధ్యాహ్నం వరకు విధులు నిర్వహించాడు. అనంతరం ఆయన అక్కడి నుండి భోజనం చేసేందుకు నిజామాబాద్ నగరంలోని నాల్కల్ రోడ్ లో గల తన ఇంటికి వచ్చారు. ఇంట్లో భోజనానికి ఉపక్రమించే సమయంలో చాతినొప్పి వస్తుందని చెప్పడంతో అతడి భార్య, కుమారుడు కలిసి గంగాధర్‌ను చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో ఆయనను పరీక్షించిన వైద్యులు మరణించినట్లుగా నిర్ధారించినట్లు తెలిపారు. ఆయన మృతి పట్ల నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, సౌత్ రూరల్ సీఐ సురేష్, మోపాల్ ఎస్సై తోపాటు తోటి సిబ్బంది తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.