వైద్యరంగంలో ఎన్నో సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. మాతాశిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రసవం అంటేనే గతంలో ప్రైవేటు దవాఖానలకు దారి పట్టేది. ఇదే అదునుగా ప్రైవేటు దవాఖానల వారు అవసరం లేకపోయినా శస్త్ర చికిత్సలు చేసి అందిన కాడికి దండుకునేది.. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు కేసీఆర్ కిట్, నగదు పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్నది. మాతా,శిశు మరణాలను తగ్గించేందుకు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నది. సీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో సైతం కాన్పుల కోసం అన్ని రకాల వసతులను కల్పించారు. దీంతో గర్భిణులు ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవం చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు.
-కోటగిరి, మే 11
కోటగిరి మే 11 : ప్రభుత్వ దవాఖానల బలోపేతానికి ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర సర్కారు.. కార్పొరేట్‌కు దీటుగా వసతులు కల్పిస్తున్నది. ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తెచ్చి ప్రజలకు నాణ్యమైన సేవలను అందిస్తున్నది. ఫలితంగా సర్కారు దవాఖానలకు రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. గత పాలకుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ దవాఖానలు ఆదరణ కోల్పో యి సర్కారు వైద్యమంటే ప్రజలు భయపడే పరిస్థితి ఉండేది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని దవాఖానల్లో అవసరమైన వసతులను కల్పించి నాణ్యమైన వైద్యం అందిస్తుండడంతో పేదలే కాకుండా మధ్య తరగతి వారు కూడా ప్రభుత్వ దవాఖానకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ప్రసవాల సంఖ్య భారీగా పెరుగుతున్నది.
కేసీఆర్ కిట్.. నగదు ప్రోత్సాహం
సర్కారు దవాఖానల్లో మెరుగైన సేవలు అందిస్తుండడంతో ప్రజల్లో నమ్మకం పెరిగింది. దీనికి తోడు గర్భిణులు, బాలింతలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు కూడా అందజేయడంతో ప్రసవం చేయించుకునేందుకు సర్కారు దవాఖానకే వెళ్తున్నారు. ప్రసవం తర్వాత 16 రకాల వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్ అందిస్తున్నారు. అమ్మాయి పుడితే రూ.13 వేలు, అబ్బాయి పుడితే రూ.12 వేల ఆర్థికసాయం అందిస్తున్నారు. దీంతో సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది. ప్రైవేటులో వైద్యులు భయబ్రాంతులకు గురిచేసి ఆపరేషన్లు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సాధారణ ప్రసవాల కోసం కొందరు ఉన్నతవర్గాలకు చెందినవారు కూడా ప్రభుత్వ వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు.
పరీక్షలు, మందులు ఉచితమే..
మహిళలు గర్భందాల్చిన నాటి నుంచి బిడ్డకు జన్మనిచ్చే వరకు ప్రైవేటు దవాఖానల్లో వైద్యం చేయించుకుంటే రూ.50వేల నుంచి లక్షపైనే ఖర్చు చేయాల్సి వస్తుంది. పేద కుటుంబాలకు చెందిన మహిళలపై ఆర్థికభారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తున్నది. గర్భం దాల్చింది మొదలు.. ప్రసవం అయ్యే వరకు సర్కారు దవాఖానల్లో వైద్యులు అన్ని రకాల పరీక్షలు చేసి ఉచితంగా మందులను కూడా అందజేస్తున్నారు. సాధారణ ప్రసవాలు చేసి తల్లీబిడ్డలను క్షేమంగా ఇంటికి పంపిస్తున్నారు. నార్మల్ డెలివరీ క్లిష్టంగా మారినప్పుడు మాత్రమే ఆపరేషన్లు చేస్తున్నారు.
పౌష్టికాహారం పంపిణీ..
మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రభుత్వ వైద్యశాలకు చెందిన గైనకాలజిస్టులు అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తూ ఆమె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నారు. దీంతోపాటు అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణుల పూర్తి వివరాలను నమోదు చేసుకొని ప్రభుత్వం సరఫరా చేసే పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా అందిస్తున్నారు. దీంతో ప్రభుత్వ దవాఖానలోనే ప్రసవాలు చేయించుకునేందుకు గర్భిణులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య భారీగా పెరిగింది. ఉమ్మడి కోటగిరి మండలంలోని పొతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏడాది కాలంలో 59 మందికి సాధారణ ప్రసవాలే నిర్వహించారు.

Government Hospitals
పీహెచ్సీలో అన్ని సౌకర్యాలు..
పొతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతోపాటు కోటగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. దీంతో ఉమ్మడి కోటగిరి మండలంలోని గర్భిణులు డెలివరీల కోసం పొతంగల్, కోటగిరి సర్కారు దవాఖానలపై మొగ్గు చూపుతున్నారు. గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు పొతంగల్ పీహెచ్సీలో 59, కోటగిరి సీహెచ్‌సీలో 130 సాధారణ డెలివరీలు అయ్యాయని డాక్టర్ విద్య తెలిపారు.
మంచిగ కాన్పు చేసిండ్రు..
నేను ప్రసవం కోసం పొతంగల్ సర్కారు దవాఖానకు పోయిన. అక్కడ పైసలు తీసుకోకుండనే అన్ని పరీక్షలు చేసిండ్రు. మందులు కూడా ఇచ్చిండ్రు. ఆపరేషన్ లేకుండా కాన్పు అయ్యింది. పాప పుట్టింది. కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు. రూ.13 వేలు నా బ్యాంకు ఖాతాల జమచేసిండ్రు. డాక్టర్లు మంచిగ చూసుకున్నరు.
– దెగ్లూర్ అర్చన, పొతంగల్ పీహెచ్సీ
సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యం..
ప్రభుత్వ దవాఖానకు వచ్చే గర్భిణులకు సాధారణ ప్రసవాలు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పించింది. ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఇబ్బం ది లేకుండా వైద్యం చేస్తున్నాం. ప్రజలకు ప్రభుత్వ దవాఖానలపై నమ్మకం పెరిగింది. అందుకే పీహెచ్‌సీల్లో కాన్పుల సంఖ్య పెరుగుతున్నది.
-డాక్టర్ కరణ్, వైద్యాధికారి, పొతంగల్
సౌలత్లు బాగున్నాయ్..
మొదటి కాన్పు అని భయపడి ప్రైవేటు దవాఖాన పోవాలని అనుకున్నం. కానీ సర్కారు దవాఖానల కూడా మంచిగ చూస్తున్నరని పొతంగల్‌కు పోయినం. ఇక్కడ డాక్టర్లు, నర్సులు మంచిగా పరీక్షలు చేసి నార్మల్ డెలివరీ చేసిండ్రు. బాబు పుడితే కేసీఆర్ కిట్ ఇచ్చి బ్యాంకు ఖాతాల 12 వేల రూపాయలు కూడా జమచేసిండ్రు. దవాఖానల సౌలత్లు చాలా బాగున్నాయ్.
– సీమాబేగం, హంగర్గాఫారం