కోటగిరి/ఎల్లారెడ్డి రూరల్, మార్చి 17: ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి వడగండ్ల వాన కురిసింది. ఉదయం నుంచి ఎండ దంచికొట్టగా, సాయంత్రం తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈదురుగాలులతో మొదలైన వర్షం వడగండ్ల వానలా మారింది. కోటగిరి, రుద్రూర్ మండలాల్లో అకాల వర్షం కురిసింది.
రుద్రూర్ మండలం చిక్కడ్పల్లి, సులేమాన్ఫారంతో పాటు కోటగిరి మండలం యాద్గార్పూర్లో వడగండ్లు పడ్డాయి. ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్, మత్తమాల, అల్మాజీపూర్, రుద్రారం తదితర గ్రామాల్లో కొద్దిసేపు భారీ వర్షం కురిసింది. వడగండ్లు కూడా పడడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. భారీగా రాళ్లు పడితే పంటలు దెబ్బ తింటాయని కంగారుకు లోనయ్యారు. అయితే, కాసేపటికే వర్షం తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకున్నారు.