నిజామాబాద్, ఫిబ్రవరి 13, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినప్పటికీ ఓటు షేరింగ్ పరంగా భారీ స్థాయిలో బీఆర్ఎస్కు ప్రజల మద్దతు దక్కిం ది. అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థాయిలో మెజార్టీ స్థానాలు పలు చోట్ల రాలే దు. అందుకు కామారెడ్డి, బోధన్ మేజర్ మున్సిపాలిటీల్లో వచ్చిన ఫలితాలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఒకట్రెండు ఓట్ల తేడాతో భారత రాష్ట్ర సమితి అభ్యర్థులకు నిరాశ ఎదురైన పరిస్థితులు వెలుగు చూశాయి. అధికార కాంగ్రెస్, బీజేపీలపై విస్తృతంగా పోరాటం చేసిన అభ్యర్థులకు స్వల్ప ఓట్లతో ఓడిపోవడంతో పార్టీ శ్రేణులను కలిచి వేసింది. కామారెడ్డి పట్టణంలోని 33వ వార్డులో రీ కౌంటింగ్ రెండు సార్లు జరిపారు. తుదకు 3 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇతరులకు అదనం గా రావడంతో బీఆర్ఎస్ అభ్యర్థి కుంబాల రవి ఓడి పోవాల్సి వచ్చింది. 2 వార్డులోనూ 14 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి మహిపాల్ రాథోడ్‌కి విజయం దూరమైంది. 21 వార్డులో 16 ఓట్లతో జువ్వాడి శిల్ప ఓటమి చెందారు. 23వ ఆర్డులో 35 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి ముస్కాన్ ఓడిపోయారు. మొత్తంగా 78 ఓట్ల తేడాతో కామారెడ్డి పట్టణంలో నాలుగు వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందింది.
ఆర్మూర్ మున్సిపాలిటీలో 200 ఓట్ల తేడాతో 6 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడి పోయారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అడుగడుగునా గట్టిగా ఎదుర్కొన్నప్పటికీ కొన్ని చోట్ల అధికార దర్పంతో కాంగ్రెస్ శ్రేణులు చూపించిన అత్యుత్సాహంతో స్వల్ప ఓట్లతో గెలవలేక పోయారు. 16వ వార్డులో 2 ఓట్ల తేడాతో తహశీల్ అనే అభ్యర్థి ఓడిపోయారు. 13 వార్డులో 13 ఓట్లతో రాము, 17 ఓట్లతో 18 వార్డులో మొయినోద్దీన్ ఓటమి చెందారు. రీ కౌంటింగ్ కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ అధికార యంత్రాంగం అంతగా స్పందించలేదు.
కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 1 వార్డులో 7 ఓట్లతో సాయిలు అనే బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయారు. మొదట 9 ఓట్లు తేడా వచ్చింది. ఆ తర్వాత రీ కౌంటింగ్ చేయడంతో 7 ఓట్ల తేడా వెలుగు చూసింది. 2 వార్డులో రాములు అనే బీఆర్ఎస్ అభ్యర్థి సైతం కేవలం 9 ఓట్లతోనే ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఎల్లారెడ్డిలో 5వ వార్డులో 28 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి దేవయ్య ఓడిపోయారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్వల్ప ఓట్లతోనే సుమారుగా 20 చోట్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ప్రతికూల ఫలితాలు వచ్చాయి.