నిజామాబాద్, జనవరి 7, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతోన్న ముత్యాల సునీల్ రెడ్డి మెడకు ఆర్థిక నేరం చుట్టుకుంది. ప్రజల నుంచి జీఎస్టీ వసూలు చేసి దొడ్డి దారిలో రూ.కోట్లు దారి మళ్లించిన వైనంపై జీఎస్టీ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. సునీల్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని ట్రావెల్స్ కంపనీ నేరుగా వినియోగదారుల నుంచి రూ.28.24కోట్లు జీఎస్టీ సేకరించింది. మూడు నెలలు గడువు గడిచినప్పటికీ ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేయకపోవడాన్ని ఆర్థిక నేరంగా డీజీజీఐ తేల్చింది.
ఇందులో భాగంగా పక్కా ఆధారాలతో ముత్యాల సునీల్ రెడ్డిని హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) అధికారుల బృందం మంగళవారం అరెస్ట్ చేయడంతో హస్తం పార్టీలో కలకలం రేపుతోంది. నిత్యం నీతులు వల్లించే అధికార కాంగ్రెస్ పార్టీలో పన్ను ఎగవేత కేసులో ఏకంగా నియోజకవర్గ ఇన్చార్జి పట్టుబడడం చర్చనీయాంశమైంది. పొద్దున లేచినప్పటి నుంచి నిత్యం అవాకులు చవాకులు పేల్చే కాంగ్రెస్ నేతలంతా ఈ వ్యవహారంతో పరువు పోగొట్టుకున్నారు.
ఆర్థిక నేరంపై కీలక నేత అరెస్ట్ కావడంతో తలలు పట్టుకుని మొఖం తలెత్తుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అవినీతి, అక్రమాలపై నీతులు వల్లిస్తూ ఎక్స్ ఖాతాలో నిత్యం పోస్టులు పెట్టే సునీల్ రెడ్డి తీరును నియోజకవర్గ ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు. ఇదేనా ప్రజాపాలన? అంటూ అడుగుతున్నారు. బాధ్యతాయుతంగా వ్యాపారం చేసి ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నేతనే జీఎస్టీ ఉల్లంఘనలకు పాల్పడి అరెస్ట్ కావడం విడ్డూరం అంటూ జనాలంతా విమర్శిస్తున్నారు.
ఎగవేత డబ్బు ఎటు వెళ్లిందో…?
ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి చర్యలు ప్రధానంగా సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) యాక్ట్ 2017 పరిధిలోకి వస్తుంది. సీజీఎస్టీ 2017 నిబంధనల మేరకు ఇతన్ని అరెస్ట్ చేశారు. పన్ను సేకరించి ప్రభుత్వానికి మూడు నెలల్లో చెల్లించకపోవడం సెక్షన్ 132 ప్రకారం నేరం. సెక్షన్ 69 ప్రకారం పవర్ టు అరెస్ట్‌ను జీఎస్టీ అధికారులు అమలు చేశారు. సెక్షన్ 76 ప్రకారం ప్రజల నుంచి సేకరించిన పన్నును జమ చేయకపోతే 100శాతం జరిమానా విధించబడుతుంది. రికవరీ కూడా చేస్తారు. భారతదేశంలో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వ్యవస్థ 2017లో అమలులోకి వచ్చినప్పటి నుంచి పన్ను ఎగవేతలు, ఉల్లంఘనలపై కేంద్ర ఆర్థిక శాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ హైదరాబాద్ యూనిట్ అధికారులు వెల్లడించిన వివరాల మేరకు సునీల్ కుమార్ రెడ్డి ఉద్దేశపూర్వకమైన ఆర్థిక నేరానికి పాల్పడ్డట్లుగా తేల్చారు. రూ.28.25కోట్లు జీఎస్టీ చెల్లింపులు చేయకపోవడంతో రంగంలోకి దిగి కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఈ మొత్తం డబ్బు ఎటు మళ్లించారు? ఏ కారణంతో ప్రభుత్వానికి చెల్లించలేదు? కోట్ల రూపాయల సొమ్మును ఇతర మార్గాల్లో పెట్టుబడిగా పెట్టారా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ డబ్బును వాడుకున్నారా? అనే అనుమానాలను నివృత్తి చేసుకునే పనిలో జీఎస్టీ అధికారులు నిమగ్నం అయ్యారు. ప్రభుత్వానికి ఎగవేతకు పాల్పడిన సొమ్మును రికవరీ కోసం సునీల్ రెడ్డికి సంబంధించిన స్థిర, చర ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు. సునీల్ రెడ్డికి చెందిన ట్రావెల్స్ వ్యాపారం గత కొంత కాలంగా ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది.
సమయానికి జీతాలు అందకపోవడంతో గడిచిన ఏడాది కాలంలో అనేక సార్లు ఉద్యోగులు, డ్రైవర్లు, క్లీనర్లు ఆందోళనలు చేశారు. జీతం డబ్బులు ఇవ్వాలంటూ సునీల్ రెడ్డిని ఉద్యోగులు నిలదీసిన వీడియోలు సైతం గతంలో వైరల్ అయ్యాయి. కాంగ్రెస్ నేత సునీల్ రెడ్డిని జీఎస్టీ అధికారులు అరెస్ట్ చేయడంతో ఆయన అనుచరులు ఆగమాగం అవుతున్నారు. అధికార పార్టీ అండదండలతో రెండేళ్లుగా బాల్కొండ నియోజకవర్గంలో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల చేత తిరష్కరణకు గురైనప్పటికీ అధికార దర్పం ప్రదర్శించి చివరకు జీఎస్టీ పన్ను ఎగవేత వంటి ఆర్థిక నేరంలో చిక్కుకుని విలవిల్లాడాల్సిన దుస్థితి ఏర్పడింది.