కామారెడ్డి, నవంబర్ 12 : జిల్లాలో ఈ నెల 17, 18వ తేదీల్లో గ్రూప్ -3 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో గ్రూప్- 3 పరీక్ష నిర్వహణపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలో 20 కేంద్రాల్లో 8,268 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని కేంద్రాలను పోలీసు అధికారులు ముందస్తుగా స్క్రీనింగ్ చేయాలని చెప్పారు. కేంద్రానికి ప్రహరీ లేకపోతే అదనంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి కేంద్రం వద్ద అవసరమైన బందోబస్తు ఏర్పాటుతోపాటు బయో మెట్రిక్ అటెండెన్స్ తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు మూసి వేయించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, విక్టర్, అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్పీ నాగేశ్వర్రావు, రీజనల్ కో -ఆర్డినేటర్ విజయ్‌కుమార్, ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ చంద్రశేఖర్, జడ్పీ సీఈవో చందర్, డీఈవో రాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కంఠేశ్వర్, నవంబర్ 12: -గ్రూప్-3 అభ్యర్థులకు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు సూచించారు. మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి వద్ద ఆర్యూబీ నిర్మాణ పనులు కొనసాగుతున్న దృష్ట్యా ఈనెల 10 నుంచి డిసెంబర్ 10 వరకు నిజామాబాద్-ఆర్మూర్ మార్గంలో వాహనాల రాకపోకలను దారి మళ్లించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రూప్-3 అభ్యర్థులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిర్ణీత సమయాని కన్నా ముందే పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఆర్మూర్వైపు వెళ్లాల్సినవారు, ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వైపు వచ్చే అభ్యర్థులు ప్రత్యామ్నాయ మార్గాల్లో కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.