కంఠేశ్వర్/ కామారెడ్డి/ వినాయక్‌నగర్, డిసెంబర్ 16 : ఉమ్మడి జిల్లాలో రెండురోజులపాటు నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. నిజామాబాద్ జిల్లాలో సోమవారం ఉదయం సెషన్లో నిర్వహించిన పరీక్షకు మొత్తం 19,855 మంది అభ్యర్థులకు 8,915 మంది హాజరు కాగా 10, 940 మంది, మధ్యాహ్నం రెండో సెషన్లో 19,855 మంది అభ్యర్థులకు 8,911 హాజరు కాగా 10,944 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు.
కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తనిఖీ చేశారు. రెండోరోజు అభ్యర్థుల హాజరు వివరాలను అధికారులను అడుగగా.. తమకు టీజీపీఎస్సీ నుంచి ఎలాంటి వివరాలూ చెప్పొద్దని ఆదేశాలు వచ్చాయని సమాధానం ఇవ్వడం గమనార్హం. ఆదివారం జరిగిన పరీక్ష కన్నా సోమవారం నిర్వహించిన పరీక్షకు తక్కువ మంది అభ్యర్థులు హాజరైనట్లు సమాచారం. కామారెడ్డి ఎస్పీ, నిజామాబాద్ ఇన్చార్జి సీపీ సింధూశర్మ ఆదేశాల మేరకు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్‌ను అమలుచేసి, గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.