కామారెడ్డి, జూన్ 6: గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా అదనపు కలెక్టర్, పరీక్షల నోడల్ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల అదనపు కలెక్టర్లు, అదనపు ఎస్పీలు, పోలీసు నోడల్ అధికారులు, రీజినల్ కోఆర్డినేటర్లు, జాయింట్ కస్టోడియన్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా 9న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించి చేపట్టాల్సిన విధి విధానాలపై జిల్లాల వారీగా సమీక్షించారు. అనంతరం కామారెడ్డి అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 4,797 మంది అభ్యర్థులు 12 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారని వెల్లడించారు. ఫస్ట్ ఎయిడ్ చికిత్సకు ఏఎన్ఎంలను నియమించామని, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్ రీజినల్ కోఆర్డినేటర్‌గా విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. వీసీలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, టీజీపీఎస్సీ రీజినల్ కోఆర్డినేటర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.