ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన వచ్చింది. మేళాలో 1500 మందికి పైగా యువతీయువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 68 కంపెనీల ప్రతినిధులు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించగా 475 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. యువత పట్టుదలతో కష్టపడితే ఉద్యోగాలు సాధించవచ్చని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. ఒకే వేదికపైకి ఇంత పెద్ద ఎత్తున కంపెనీలను తీసుకొచ్చిన ఎమ్మెల్యేకు నిరుద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.
కామారెడ్డి, జూలై 23 : నిరుద్యోగులు పట్టుదలతో కష్టపడితే అనుకున్న లక్ష్యాలను సాధించుకోవచ్చునని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపికైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతిసారి కలెక్టర్ కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించేవారని, తనవంతుగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్‌మేళాను నిర్వహించామన్నారు. గతంలో యువత జాబ్ కోసం హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లేవారని, ఇప్పుడు 68 కంపెనీలను కామారెడ్డికి తీసుకువచ్చి యువతకు ఉద్యోగ అవకాశం కల్పించామన్నారు. జాబ్‌మేళాలో సుమారు 1500మంది యువతీయువకులు పాల్గొనగా 475 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు.
జాబ్ కోసం హైదరాబాద్‌లో 68 కంపెనీల్లో తిరగాలంటే ఎన్ని రోజులు పడతాయో ఒక్కసారి ఆలోచించుకోవాలని, కామారెడ్డిలోనే.. ఒకే వేదికపైకి 68 కంపెనీలు రావడం ఎంతో మేలన్నారు. గ్రామీణ ప్రాంత యువతకు మంచి అవకాశమని పేర్కొన్నారు. సులభంగా మెగా జాబ్‌మేళాలో పాల్గొంటూ ఉద్యోగాలకు ఎంపికై జీవితంలో స్థిరపడొచ్చని అన్నారు. ఉద్యోగం రానివారు నిరాశపడకుండా, మరింత మంచి ఉద్యోగం సాధించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కష్టపడి, క్రమశిక్షణతో ప్రయత్నిస్తే జీవితంలో సక్సెస్ అవుతామని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, విప్ గంపగోవర్ధన్ తనయుడు గంప శశాంక్, మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పిరి వెంకటి, వైస్ చైర్మన్ కుంబాల రవియాదవ్, గైని శ్రీనివాస్‌గౌడ్, బల్వంత్ రావు, బీఆర్ఎస్ పట్టణ యువజన అధ్యక్షుడు భానుప్రసాద్, మాచారెడ్డి మండల అధ్యక్షుడు అజీజ్, కళాశాల ప్రిన్సిపాల్ కిష్టయ్య, జాబ్‌మేళా కోఆర్డినేటర్లు ఫర్హీన్, చందన్, బాలప్రసాద్, వివిధ కంపెనీల హెచ్ఆర్లు, యువతీయువకులు పాల్గొన్నారు.
Nizamabad1
మరిన్ని జాబ్‌మేళాలు నిర్వహించాలి
తెలంగాణ సాధించిన తర్వాత 50వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించాయని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్ అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో ఉద్యోగ అవకాశాలకు మార్గం సుగమం అయ్యిందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో యువతకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. విప్ గంపగోవర్ధన్ భవిష్యత్తులో మరిన్ని జాబ్‌మేళాలు నిర్వహించాలని కోరారు.
కష్టపడితే తప్పకుండా జాబ్వస్తుంది…
ప్రతి ఒక్కరూ కష్టపడితే తప్పకుండా జాబ్ వస్తుందని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. జాబ్ రిక్రూట్మెంట్లో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. ప్రభుత్వ విప్ మెగా జాబ్‌మేళా నిర్వహించి యువతకు ఉద్యోగ అవకాశం కల్పించడం ఎంతో అభినందనీయమన్నారు. యువత హైదరాబాద్‌కు వెళ్లి ఉద్యోగం సాధించాలంటే ఎంతో కష్టంగా ఉండేదని, కామారెడ్డికే కంపెనీలు వచ్చి జాబ్‌మేళాలో పాల్గొనడం సంతోషకరమన్నారు.
యువత విధేయతతో ఉండాలి
నేటి యువత విధేయత, నిబద్ధతతో ఉండాలని కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఉద్యోగానికి ఎంపికైన వారు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సూచించారు. భవిష్యత్తులో మరింత ఉన్నతస్థాయికి చేరుకుంటారని తెలిపారు. నిబద్ధతతో పనిచేస్తే కంపెనీలు మంచి అవకాశాలు కల్పిస్తాయని వివరించారు.
ఒకేసారి ఇన్ని కంపెనీలు రావడం సంతోషకరం..
జాబ్ రావాలంటే హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లి ఎన్ని కంపెనీల చుట్టూ తిరిగినా ఒక్కోసారి ఉద్యోగం రాదు. సమ యం కూడా ఎక్కువ పడుతుంది. కానీ, విప్ గంప గోవర్ధన్ కృషితో ఒక్కరోజే 68 కంపెనీలు కామారెడ్డికి రావడం సంతోషకరం.
-భువన రాధ, అన్నారం
ఉద్యోగం వస్తదని అనుకోలేదు..
మెగా జాబ్‌మేళాలో నాకు ఉద్యోగం వస్తుందని అనుకోలేదు. చాలామంది రావడంతో తనకు వస్తదో రాదో అని అనుకున్నా. జాబ్‌కు ఎంపికైన వారిలో నా పేరు మొదటిసారి పిలవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
-శ్రీలత, కామారెడ్డి
ఎమ్మెల్యేకు ధన్యవాదాలు..
ఎంతో మంది యువత ఉద్యోగాలు లేక బాధపడుతున్న తరుణంలో ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ చొరవ తీసుకొని జాబ్‌మేళా నిర్వహించడం అభినందనీయం. ఒకే వేదికపైకి 68 కంపెనీల ప్రతినిధులను తీసుకొచ్చి విద్యార్హతలకు అనుగుణంగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. చాలా మందికి ఉద్యోగ అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు.
-శ్రీజిత్, బస్వాపూర్
అనేక సౌకర్యాలు కల్పించారు..
దూరప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం మెగా జాబ్‌మేళాలో అన్ని సౌకర్యాలు కల్పించారు. ఉచితంగా భోజనం, నీటి వసతి, ఇంటర్వ్యూలకు ఎలాం టి ఇబ్బంది లేకుం డా చూశారు. అన్ని కంపెనీల వారు ఎవరికి వారే ఇంటర్వ్యూలు చేయ డం చాలా మంచిగా అనిపించింది.
-సురేశ్, క్యాసంపల్లి తండా