ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక విద్యారంగానికి సీఎం కేసీఆర్ పెద్దపేట వేస్తున్నారు. పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అనేక పాఠశాలలను ఏర్పాటు చేశారు. కార్పొరేట్ సౌకర్యాలతో రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సర్కారు బడుల్లో నాణ్యమైన చదువును విద్యార్థులకు అందిస్తున్నారు. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమయ్యే జూనియర్, డిగ్రీ కళాశాలలను మండలాలకూ తీసుకువస్తున్నారు. దీంతో విద్యార్థులు ఆటంకం లేకుండా ఉన్నత విద్యను సైతం అభ్యసిస్తున్నారు.
మద్నూర్, ఆగస్టు 11 : పిల్లల ఉన్నత చదవుల కోసం మద్నూర్ మండల ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న డిగ్రీ కళాశాల మంజూరైంది. తమ ప్రాంతానికి డిగ్రీ కళాశాల కావాలని విద్యార్థులు, విద్యావేత్తలు.. స్థానిక నాయకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డిగ్రీ చదవడానికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దూరప్రాంతాలకు పంపలేకపోతున్నామని తల్లిదండ్రులు అనేక సందర్భాల్లో వాపోయారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, చదువు విలువ తెలిసిన జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే.. ప్రత్యేక చొరవ తీసుకొని ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుపై ప్రభావం పడకూడదనే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి మద్నూర్ మండలానికి డిగ్రీ కళాశాలను మంజూరు చేయించారు. ఎంపీ బీబీ పాటిల్ సైతం కళాశాల మంజూరుకు తనవంతు కృషి చేశారు.
మూడు మండలాలకు వరం..
మద్నూర్, డోంగ్లి, జుక్కల్ మండలాల విద్యార్థులకు డిగ్రీ కళాశాల ఓ వరంలా మారింది. ఇక్కడి విద్యార్థులు డిగ్రీ కోసం బిచ్కుంద, బాన్సువాడ.. లేదంటే నిజామాబాద్, కామారెడ్డికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇతర ప్రాంతాలకు వెళ్లే ఆర్థిక స్థోమతలేనివారు ఇంటర్‌తోనే సరిపెట్టుకొనేవారు. ఆడపిల్లలను దూర ప్రాంతాలకు పంపించేందుకు కొందరు తల్లిదండ్రులు ఆసక్తి కనబర్చేవారు కాదు. ప్రస్తుతం మద్నూర్ మండలకేంద్రంలోనే డిగ్రీ కళాశాల ఏర్పాటుకావడంతో మూడు మండలాల విద్యార్థులకు ఎంతో సౌకర్యవంతంగా మారింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని బాగా చదువుకోవాలని కళాశాల ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యే హన్మంత్ షిండే సూచించారు. విద్యార్థులకు ఎల్లప్పుడూ తన సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. నియోజకవర్గ పిల్లల భవిష్యత్తే తనకు ముఖ్యమని, రాబోయే రోజుల్లో మండలానికి పీజీ కళాశాలను కూడా తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులను ప్రారంభించనుండడంతో స్థానికులు, విద్యార్థులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
అప్పట్లో కామారెడ్డికివెళ్లి చదువుకున్నా..
అప్పట్లో ఇక్కడ కళాశాలలు లేవు. నేను డిగ్రీ చేసేందుకు కామారెడ్డికి వెళ్లాల్సి వచ్చింది. మద్నూర్‌కు డిగ్రీ కళాశాల రావడం సంతోషకరం. ఇది స్థానిక పిల్లల భవిష్యత్తుకు ఎందో ఉపయోగకరంగా ఉంటుంది. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు మండలంలోనే చదువుకునే అవకాశం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
-రమేశ్, ఉపాధ్యాయుడు
ఆనందంగా ఉంది..
మా మండలానికి డిగ్రీ కళాశాల రావడం చా లా ఆనందంగా ఉంది. అప్పట్లో మేము దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోలేకపోయాం. డిగ్రీ కళాశాల ఏర్పాటుచేయడంతో విద్యార్థులకు చాలా సౌకర్యంగా మారింది. ఇంటర్‌తోనే చదువు మానేసినవారు కూడా డిగ్రీ చేస్తారు. నా భార్య, తమ్ముడికి కూడా ఇక్కడే డిగ్రీ చేయిస్తా.
-శంకర్, మద్నూర్
ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతులు..
మద్నూర్ మండలానికి జూలై నెలలో కళాశాల మంజూరు కావడంతో ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతులను ప్రారంభించాలని అధికారిక జీవో విడుదలయ్యింది. ఈ మేరకు అడ్మిషన్లను కూడా తీసుకోవాలని సూచించారు. తరగతులను నిర్వహించేందుకు మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలోనే డిగ్రీ కళాశాలను కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. డిగ్రీ కళాశాలను ఆగస్టు ఒకటో తేదీన ఎమ్మెల్యే హన్మంత్‌షిండే ప్రారంభించారు. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న కళాశాల మంజూరుకావడంతో మండల ప్రజలు, విద్యార్థులు ఆనందం వ్యక్తంచేశారు. స్థానిక నాయకులు పటాకులు కాల్చి, మిఠాయిలు పంచి పెట్టారు. కృతజ్ఞతగా ఎమ్మెల్యే హన్మంత్షిండేను ఘనంగా సన్మానించారు.