కామారెడ్డి/ కంఠేశ్వర్, ఆగస్టు 15 : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. వాడవాడలా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కలెక్టరేట్‌తోపాటు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ జెండాను ఎగురవేశారు.

జాతీయ నేతల విగ్రహాలు, చిత్రపటాలకు నివాళులర్పించారు. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యఅతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సలహాదారు వి.హన్మంతరావు హాజరయ్యారు.

జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన శకటాలను, స్టాళ్లను పరిశీలించారు. ఉత్తమ సేవలను అందించిన పలువురికి ప్రశంసాపత్రాలను అందజేశారు.

జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమాల్లో నిజామాబాద్ ఇన్చార్జి కలెక్టర్ భవేష్ మిశ్రా, కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, నిజామాబాద్ సీపీ సాయిచైతన్య, కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.